తాజాగా కోర్టుకు జగన్ ఏం చెప్పారు?

Update: 2019-09-06 05:22 GMT
ప్రతి వారం హైదరాబాద్ లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు హాజరు నుంచి మినహాయింపు కోరారు. ఇందుకు పలు కారణాల్ని చూపారు. తాజాగా సీబీఐ కోర్టుకు తన న్యాయవాది ద్వారా జగన్ పలు అంశాల్ని ప్రస్తావించారు. ఇందుకు సంబంధించిన పిటిషన్ ను దాఖలు చేశారు. అందులో పేర్కొన్న అంశాల్ని చూస్తే..

ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న తాను అధికారిక వ్యవహారాల్లో పాల్గొనాల్సి ఉంటుందని.. ఎక్కువ సమయం పాలనకు కేటాయించాలన్నారు. కోర్టుకు హాజరయ్యేందుకు తరచూ హైదరాబాద్ కు రావటం వల్ల పాలన దెబ్బ తినే అవకాశం ఉందన్నారు. దీంతోపాటు.. ప్రాక్టికల్ ప్రాబ్లంను ఆయన్ను ప్రస్తావించారు.

ముఖ్యమంత్రి హోదాలో కోర్టు విచారణకు హాజరు కావటం వల్ల పాలన దెబ్బ తినే అవకాశం ఉందని.. సీఎం హోదాలో ఉన్నందున ప్రోటోకాల్ కు సంబంధించిన అంశాలతోపాటు.. భద్రతకు సంబంధించి భారీగా ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. అందుకే సీఎం హోదాలో ఉన్న తన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

తన వ్యక్తిగత హాజరు తప్పనిసరి అని కోర్టు భావించి.. ఆదేశాలిచ్చినప్పుడు తాను తప్పకుండా వస్తానని పేర్కొన్నారు. ఏదైనా కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న వ్యక్తి ప్రతి వాయిదాకు హాజరు కావాల్సిన అవసరం లేదంటూ బసవరాజ్ ఆర్.పాటిల్ వర్సెస్ భాస్కర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కేసుల్లో సుప్రీం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ పై కోర్టు ఈ రోజు నిర్ణయం ప్రకటిస్తుందని చెబుతున్నారు.
Tags:    

Similar News