గుణ‌పాఠంతో పోరాటం షురూ చేస్తున్న జ‌గ‌న్‌

Update: 2016-07-07 08:42 GMT
రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రయత్నంపై పోరాటమో...పార్టీని గ్రామస్దాయిలో బలపరిచి స్దిరత్వాన్ని సాధించాలన్నా ఆరాటామో...గాని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నారు. త‌న తండ్రి - దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ఆశయాలతో ఆవిర్భవించిన పార్టీ అని పదే పదే చెప్పే జగన్‌ మోహన్‌ రెడ్డి ఆయన జయంతి రోజునే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏడాది డిసెంబర్ 31వరకు చేపట్టాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామానికి - ప్రతి ఇంటికి పార్టీ నేతలు వెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు రెండేళ్లపాలన - ఆయన అవినీతిపై పార్టీ ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేయాలని జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకులకు సూచించారు. కరపత్రంలో చంద్రబాబు పాలనలో పాసైయ్యాడా? పెయిల్ అయ్యాడా? అని ప్రజలను కోరుతూ వంద ప్రశ్నలతో కూడిన కరపత్రాన్ని ప్రజలకు ఇచ్చి వారి అభిప్రాయాన్ని కోరనున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రెండేళ్ల పాలనలో లక్ష 45వేల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డాడని, అమరావతి రాజధాని పేరుతో కోట్లు విలువ చేసే భూమిని సింగపూర్ కంపెనీలకు దారదత్తం చేస్తున్నా రని తదితర అంశాలను ప్రజలకు వివరించడమే ధ్యేయంగా పార్టీ శ్రేణులు కదలనున్నాయి. ప్రతి అసెంబ్లి నియోజకవర్గంలోను సరాసరి 50వేల కుటుంబాలు ఉంటాయని అంచనా వేసి 5 నెలల కాలంలో ప్రతి కుటుంబాన్ని ఆయా గ్రామ - మండల - నియోజకవర్గస్దాయి నాయకులు తప్పకుండా ప్రజలను కలిసేలా ఈ ఉద్యమం దోహదం చేస్తుంది.

ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే చాలా ఆందోళనలు చేపట్టారు. రైతుల కోసం - విద్యార్దుల కోసం యువభేరిలు నిర్వహించారు. పలు సందర్భాలలో నిరాహారదీక్ష లు చేపట్టారు. ప్రత్యేక హోదా కోసం కూడా నిరసన దీక్షకు దిగారు. ఈ కార్యక్రమాలన్ని పార్టీ పరంగా విజయవంతం అయినప్పటికి ప్రజలలో అనుకున్నంతగా స్పందనలు రాబట్టలేకపోయాయి. ప్రత్యేక హోదా కోసం ప్రతి పక్షనేత హోదాలో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరసన దీక్ష చేపడు తుంటే.. ఆ పార్టీ ఎంఎల్ ఏలు - ఎంపిలు - నియోజకవర్గ ఇన్‌ చార్జీలు దీక్షా శిభిరం చుట్టు ప్రదక్షణలు చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసి తమ మద్దతు ప్రకటించారు తప్ప.. ప్రత్యేక హోదా డిమాండ్‌ కు ఉన్న ప్రాధాన్యతను, తమ నాయకుడు దీక్ష పట్టుదలను ఆపార్టీ నాయకులే సిరియస్‌ గా తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రత్యేకహోదా కోసం జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన దీక్షకు కమ్యూనిస్టు పార్టీలు ఎంఆర్‌ పిఎస్ - ఉద్యమ సంఘాలు  - పలు ప్రజాసంఘాలు - విద్యార్ది సంఘాలు మద్దతు ప్రకటించాయి. అయితే ప్రజా సంఘాలు - ఇతర పార్టీల మద్దతులు కలుపుకొని ప్రత్యేక హోదా విషయమై జగన్ దీక్షకు మద్దతుగా రాష్ట్రం మొత్తం మీద ఎక్కడికక్కడ ఉద్యమాన్ని బలోపేతం చేసి రాష్ట్రాన్ని స్తంభింపజేయాలన్నది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రణాళిక. కాని ఈ విషయం లో పార్టీ శ్రేణులు పూర్తిగా విఫలమయ్యాయి.

ఈ ఆలోచనలతో పుట్టిందే గడపగడపకు వైఎస్ ఆర్‌ సిపి కార్యక్రమం అని పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతోంది. అధినేత ఒక్కడే పోరాడితే సరిపోదని గ్రామ స్థాయి నుండి ప్రజా మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలన్నా నిర్ణయం ఆ పార్టీ తీసుకొంది. గడపగడపకు వైఎస్ ఆర్‌ సిపి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతో పాటు పార్టీ నాయకులను ప్రజల ముందుకు వెళ్లేలా చేయడం ద్వారా గ్రామస్దాయి నుండి పార్టీని బలోపేతం చేసినట్లు అవుతుందని ఆ పార్టీ అధినేత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 5 నెలలపాటు జరిగే ఈ కార్యక్రమం పర్యవేక్షణ కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసి జిల్లా - రాష్ట్ర స్థాయిలో మానిట‌రింగ్‌ చేయనున్నారు.
Tags:    

Similar News