బాబూ... జ‌గ‌న్ ప్ర‌శ్న‌ల‌కు బ‌దులేదండీ!

Update: 2018-03-25 12:26 GMT
ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. స‌రిగ్గా నాలుగు నెల‌ల క్రితం త‌న తండ్రి స‌మాధి ఉన్న ఇడుపుల‌పాయ నుంచి ప్రారంభ‌మైన సుదీర్ఘ పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఏమాత్రం అల‌సిపోకుండానే ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే ఆరు జిల్లాల‌ను దాటేసిన జ‌గ‌న్ యాత్ర ఇప్పుడు ఏడో జిల్లా అయిన గుంటూరు జిల్లాలో కొన‌సాగుతోంది. యాత్ర దూరం పెరిగే కొద్దీ నేత‌ల్లో అస‌లట క‌నిపించ‌డం స‌హజం. అయితే అందుకు విరుద్ధంగా త‌న యాత్ర దూరం పెరిగిన కొద్దీ జ‌గ‌న్ ప్ర‌సంగంలో వాడీ వేడీ పెరుగుతోంది. ప్ర‌భుత్వంపై త‌న దాడిని జ‌గ‌న్ మ‌రింత‌గా పెంచేస్తూ పోతున్నారు. మొన్న‌టిదాకా ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ సాగిన జ‌గ‌న్ ప్ర‌సంగాలు ఇప్పుడు ఏకంగా ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌లు సంధించే స్థాయికి చేరిపోయింది. నిన్న గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట‌లో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌కు అశేష జ‌నం త‌ర‌లివ‌చ్చారు. టీడీపీకి కంచుకోట‌గా ఉన్న న‌ర‌స‌రావుపేట‌లో జ‌గ‌న్‌కు వ‌చ్చిన జ‌న ప్ర‌భంజ‌నాన్ని చూసిన తెలుగు త‌మ్ముళ్లు నిజంగానే డంగైపోయార‌న్న క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

జ‌న హోరు ఓ వైపు... ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో చంద్ర‌బాబు వినిపిస్తున్న కొత్త రాగం మ‌రోవైపు... ఈ రెండు కార‌ణాల‌తో చెల‌రేగిపోయిన జ‌గ‌న్‌... నిన్న‌టి స‌భా వేదిక నుంచి చంద్ర‌బాబుకు చాలా సూటిగా ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌లు ఎలా ఉన్నాయంటే... అస‌లు ఆ ప్ర‌శ్న‌ల‌కు బాబు నుంచి స‌మాధానం వ‌స్తుందా? అన్న అనుమానాల‌ను రేకెత్తించేలా ఉన్నాయి. ఎందుకంటే గ‌తంలో చంద్ర‌బాబు స్వ‌యంగా హోదాను వ‌ద్ద‌న్న విష‌యం ద‌గ్గ‌ర నుంచి ప్యాకేజీనే బెట‌రంటూ చేసిన వ్యాఖ్య‌లు... పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రం నిర్మిస్తామంటే... కాదు కాదు తామే నిర్మించుకుంటామని చంద్ర‌బాబు రాయ‌బారం న‌డిపిన తీరుపై జ‌గ‌న్ తూటాల్లాంటి ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. వాస్త‌వంగా ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పాలంటే చాలా ధైర్యం కావాలి. నిజం నిర్భయంగా ఒప్పుకునే నేత‌లు మాత్ర‌మే ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇవ్వ‌గ‌ల‌ర‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి రోజుకో మాట చెప్పే చంద్ర‌బాబు నుంచి ఈ త‌ర‌హా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఆశించ‌డం దుర్ల‌భ‌మేన‌ని కూడా కొంద‌రు వాదిస్తున్నారు.

అస‌లు ఏనాడైనా చంద్ర‌బాబు విప‌క్షాలు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు సూటిగా స‌మాధానం చెప్పారా?.. ఇప్పుడు కూడా అంతే. జ‌గ‌న్ సంధించిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు శిబిరం నుంచి ఒక్క‌టంటే ఒక్క స‌మాధానం కూడా రాద‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. మొత్త‌గా జ‌గ‌న్ సంధిస్తున్న ప్ర‌శ్న‌ల పరంప‌ర‌తో చంద్ర‌బాబు అండ్ కో బేజారెత్తిపోతోంద‌న్న వాదన కూడా లేక‌పోలేదు. పాద‌యాత్ర‌లో అల‌సిసొల‌సి జ‌గ‌నే యాత్ర‌ను ర‌ద్దు చేసుకుంటార‌ని భావించిన టీడీపీ... అందుకు విరుద్ధంగా యాత్ర దూరం పెరిగిన కొద్దీ జ‌గ‌న్‌ లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తుండ‌టం, త‌మ‌పై నేరుగా ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌డం - ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్ట‌డం - రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను తాక‌ట్టు పెట్టేలా వ్య‌వ‌హ‌రించిన తమ తీరుపై సూటిగా ప్ర‌శ్న‌లు సంధిస్తుండ‌టంతో నిజంగానే చంద్ర‌బాబు స‌ర్కారు డైల‌మాలో ప‌డిపోయింద‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ విమ‌ర్శ‌ల‌కు స్పందించే ధైర్యం కూడా లేక టీడీపీ శ్రేణులు నేల చూపులు చూస్తున్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే.. జ‌గ‌న్ యాత్ర‌తో టీడీపీ యంత్రాంగం పూర్తిగా అయోమ‌యంలో కూరుక‌రుపోయింద‌న్న మాట‌.


Tags:    

Similar News