కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త

Update: 2021-06-19 05:30 GMT
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి జగన్ సర్కార్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఇక నుండి మినిమమ్‌ పే స్కేల్‌ వర్తింపజేయాలని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో పనిచేసే కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం పేస్కేల్‌ వర్తింపజేయాలని నిర్ణయించింది. వీరిలో కన్సల్టెంట్లు, సలహాదారులు, ఓఎస్డీలకు పే స్కేల్‌ వర్తించదని ప్రభుత్వం వెల్లడించింది.

అలాగే ,  కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు 180 రోజుల మెటర్నిటీ లీవ్‌ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇక ప్రమాదంలో మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి 5లక్షల రూపాయల సాయం, అలాగే సహజంగా మరణించిన కాంట్రాక్ట్ ఉద్యోగి కుటుంబానికి రూ.2లక్షల సాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖజానాపై రూ.365 కోట్ల రూపాయల భారం పడనున్నట్లు అంచనా వేస్తుంది. మరోవైపు ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగానే పరిగణలోకి తీసుకోవాలని, సకాలంలో జీతాలు చెల్లించాలని గతంలోనే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పర్మినెంట్ ఉద్యోగులకు కల్పించే ప్రయోజనాలు అన్ని కూడా వారికి అందించేలా నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంపై కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో ఈ నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
Tags:    

Similar News