28న ప్రధానితో జగన్‌ భేటీ.. కారణమిదేనా?

Update: 2022-12-26 10:19 GMT
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రధాని నరేంద్ర మోదీతో డిసెంబర్‌ 28న భేటీ కానున్నారు. కాగా ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో అన్ని పార్టీల నేతలతో జరిగిన అఖిలపక్ష సమావేశానికి జగన్‌ హాజరైన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా కొద్ది నిమిషాలపాటు జగన్‌.. ప్రధానితో మాట్లాడారు.

ఈ నేపథ్యంలో మరోసారి ఏపీ సీఎం జగన్‌.. ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. విశాఖపట్నంలో జి 20 సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత గురించి ప్రధానికి వివరించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

విశాఖపట్నంలో జి20 దేశాల రెండు సమావేశాలకు ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మొదటి సమావేశం 2023 ఫిబ్రవరి 3, 4 తేదీల్లో జరగనుంది. రెండవ సమావేశం ఏప్రిల్‌ 24న జరగనుంది. కాగా జీ 20 దేశాల సమావేశానికి ఏర్పాట్లను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది.

అలాగే కడపలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసేందుకు ప్రధానిని కూడా ముఖ్యమంత్రి జగన్‌ ఆహ్వానించనున్నారు. సంక్రాంతి సందర్భంగా స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

జిందాల్‌ గ్రూపునకు చెందిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్‌ లిమిటెడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్టీల్‌ ప్లాంట్‌ కాంట్రాక్టును ఇచ్చింది. విశాఖపట్నంలో రైల్వే జోన్, రామాయపట్నంలో ఓడరేవు, రాష్ట్రానికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా జగన్‌ లేవనెత్తుతారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రధానికి వివరిస్తారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలా నిధులు మంజూరు చేయాలని.. సవరించిన అంచనాల మేరకు రూపొందించిన వ్యయాన్ని అందించాలని కోరనున్నారు.

అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యలో ఏపీలో శాసనసభ స్థానాల పెంపు అంశాన్ని కూడా ప్రస్తావిస్తారని సమాచారం. ఏపీలో ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ స్థానాలను 225కు పెంచాల్సి ఉంది. జమ్ము కాశ్మీర్‌ లో ఇటీవల అసెంబ్లీ స్థానాలను పెంచిన నేపథ్యంలో ఏపీలో సైతం అసెంబ్లీ స్థానాలను పెంచాలని జగన్‌ ప్రధానికి విన్నవిస్తారని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News