వైఎస్ లా క్షమించను.. పచ్చ మీడియాకు జగన్ వార్నింగ్!

Update: 2019-10-17 11:31 GMT
వైఎస్ రాజశేఖ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై కొన్ని మీడియా వర్గాలు చెలరేగిపోయి నెగిటివ్ వార్తలను రాశాయి. ఆయన ప్రభుత్వంపై బురద జల్లడానికి శతథా ప్రయత్నించాయి. వైఎస్ ను సీఎం సీటు నుంచి దించి, చంద్రబాబును కూర్చోబెట్టడానికి రెండు పత్రికలు శతథా ప్రయత్నించాయి. అయితే అది వారి తరం కాలేదు.

రెండోసారి కూడా వైఎస్ మళ్లీ ముఖ్యమంత్రిగా నెగ్గారు. అంత కష్టపడ్డా ఆ మీడియా వర్గం చంద్రబాబును గెలిపించలేకపోయింది. వైఎస్ పై ఆ మీడియా వర్గాలు బురద జల్లడం మాత్రం చాలా గట్టిగానే చేశాయి. అయితే ఆయన వాటిపై ధ్వజమెత్తుతూ కూడా కామ్ గానే ఉన్నారు.

'ఆ రెండు పత్రికలూ..' అంటూ తరచూ విమర్శలు సంధించేవారు. ఆ తర్వాత సొంతంగా 'సాక్షి'ని తెచ్చారు. కౌంటర్లు రాయించారు. అయితే వైఎస్ ఆ మీడియా వర్గాల విషయంలో పెద్ద మనసుతోనే వ్యవహరించారు.
అయితే జగన్ మాత్రం ఆ మీడియా వర్గాలను అంత తేలికగా వదిలేలా లేరు. అందులో  భాగంగా ఆయన కొత్త వ్యూహాన్ని రెడీ చేశారు.  తన ప్రభుత్వంపై నెగిటివ్ వార్తలను సమీక్షించాలని జగన్ నిర్ణయించుకున్నారు. అవినీతి విషయంలో అయినా, మరేవిషయంలో అయినా తప్పుడు  కథనాలకు, బురదల జల్లుడు వ్యవహారాలకూ చెక్ చెప్పాలని జగన్ భావిస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది.

అందులో భాగంగా మీడియావర్గాలకు కూడా గట్టి హెచ్చరిక జారీ చేశారు. తన ప్రభుత్వం నెగిటివ్ వార్తలను రాయాలనుకుంటే  రాసుకోండి. ఇబ్బంది లేదు. అయితే ఏం రాసినా.. రుజువులు చూపాలి. రుజువులు లేకుండా కేవలం గాలి వార్తలను రాసి ప్రభుత్వంపై అడ్డగోలుగు బురద జల్లాలని చూస్తే చట్టపరమైన చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని జగన్ గట్టి సంకేతాలను ఇస్తూ ఉన్నారు.

ప్రభుత్వానికి అనుకూలంగా రాయాల్సిన అవసరం లేదు. అయితే బురద జల్లితే మాత్రం రుజువులు చూపాలని జగన్ కోరుతూ ఉన్నారు. రుజువులు ఉంటేఏమైనా రాసుకోవచ్చు. అలా కాకుండా బురద జల్లడానికే రాతలు రాస్తే మాత్రం.. సదరు మీడియా సంస్థ, దాన్నిరాసిన జర్నలిస్టు కూడా చర్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని, చట్టపరంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని జగన్ ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

కేవలం ప్రింట్ మీడియాకే కాకుండా - వెబ్ మీడియాకు - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి కూడా ఈ హెచ్చరిక జారీ చేశారు. ప్రభుత్వం పై నెగిటివ్ వార్తలు రాసుకోవచ్చు. అయితే ఏం రాసినా రుజువులు చూపాలనేది జగన్ ప్రభుత్వం వాదన. మొత్తానికి  వైఎస్ లా పెద్ద మనసు చేసుకుని జగన్ వ్యతిరేక మీడియా ఆటలను సాగనిచ్చేలా లేరు. ఎక్కడిక్కడ చెక్ చెప్పడానికి  బలంగానే తాడు పేనుతున్నట్టుగా ఉన్నారు!


   

Tags:    

Similar News