జ‌గ్గారెడ్డి ఇలా రూటు మార్చావేంటి..!

Update: 2019-10-13 14:25 GMT
టీ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత - సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి  రోజుకో మాటతో సొంత పార్టీ నేతల్లోనే పెద్ద క‌న్‌ఫ్యూజ్‌కు గురి చేస్తున్నారు. లోక్‌ స‌భ ఎన్నికలకు ముందు నుంచి జయప్రకాష్ రెడ్డి వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటూనే... మిగిలిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పెద్దగా కలిసినట్టు ఉండటం లేదు. అదే టైంలో 14 సంవత్సరాలుగా అసలు మాటే మాట్లాడని టిఆర్ ఎస్ మంత్రి హరీష్ రావును కలిసి సాలువా కప్పి సన్మానం చేశారు. ఇదే పెద్ద ట్విస్ట్ అనుకుంటే సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని... అందుకోసం తాను ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు త‌ల వంచుతానని... తన నియోజకవర్గ నేతలకు సైతం కేసీఆర్‌ ను విమర్శించ‌వ‌ద్ద‌ని చెపుతాన‌న్నారు.

అంతేకాకుండా బీజేపీపై సైతం విమర్శలు చేయవద్దని కూడా వాళ్ల‌కు చెపుతున్నాన‌ని  రెండు రోజుల కింద వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జ‌య‌ప్రకాష్ రెడ్డి పై వ్యాఖ్యలు చేసి రెండు రోజులు అయిందో లేదో వెంటనే ఈ రోజు కాస్త మాట మార్చారు. నియోజకవర్గ ప్రజల కోసం సంగారెడ్డిలో ముఖ్యమంత్రి ముందు తల దించుకుంటా... కానీ హైదరాబాద్‌ వస్తే మాత్రం ప్రజా సమస్యలపై తల ఎత్తి ప్రశ్నిస్తానని చెప్పారు. తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మె ఉధృతంగా జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో విప‌క్ష నేత‌లు ఎవ‌రికి వారు స్పందిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం గాంధీభవన్‌ కు వచ్చిన ఆయన రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మీడియాతో మాట్లాడారు.

ఖ‌మ్మంలో ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌ రెడ్డి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్న జ‌గ్గారెడ్డి అత‌డి కుటుంబానికి కాంగ్రెస్ త‌ర‌పున‌ ప్ర‌గాఢ సానుభూతి కూడా తెలిపారు. కేసీఆర్ ఒక మెట్టు దిగి అస‌లు లోపం ఎక్క‌డుందో తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. తెలంగాణ ఉద్య‌మంలో క్రియాశీల‌కంగా ఉన్న ఆర్టీసీ కార్మికుల‌ను కేసీఆర్ ఈ రోజు రోడ్డెక్కించార‌ని జ‌గ్గారెడ్డి విమ‌ర్శించారు. కార్మికుల స‌మ‌స్య‌ల‌పై ముఖ్య‌మంత్రిని ఒప్పించ‌లేక‌పోతే ర‌వాణా శాఖా మంత్రి చ‌రిత్ర హీనుడ‌వుతాడ‌ని విమ‌ర్శించారు. ఏదేమైనా రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే జ‌గ్గారెడ్డి కేసీఆర్‌ పై మాట తిర‌గేసేయ‌డం విశేషం.
Tags:    

Similar News