ఒక నినాదం ప్ర‌జ‌ల్ని భ‌య‌పెట్టేలా చేయ‌ట‌మా?

Update: 2019-07-06 06:18 GMT
త‌మ ఉనికిని చాటుకోవ‌టానికి నినాదాల్ని వాడుకోవ‌టం కొత్త విష‌యం కాదు. గ‌తంలో ఎప్పుడూ.. ఎక్క‌డా లేని రీతిలో ఒక నినాదంతో ఆగ‌మాగం చేస్తున్న వైనం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జైశ్రీ‌రాం అంటూ బీజేపీ నేత‌లు చేస్తున్న నినాదం కొత్త కొత్త వివాదాల‌కు తెర తీస్తోంది. జైశ్రీ‌రాం అన్న నినాదం చేయ‌ని వారిపై దాడులు చేయ‌టాన్ని ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. దేశంలోని ఇత‌ర ప్రాంతాల సంగ‌తి ఎలా ఉన్నా ప‌శ్చిమ‌బెంగాల్ లో మాత్రం ఈ వ్య‌వ‌హారం ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో ఉంద‌న్న మాట ప‌లువుని నోట వినిపిస్తోంది.

ఎక్క‌డిదాకానో ఎందుకు ప‌శ్చిమబెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ పాల్గొన్న కార్య‌క్ర‌మాల్లో బీజేపీ నేత‌లు ప‌లువురు జైశ్రీ‌రాం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయ‌టం.. ఆమెను ఇరుకున పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌టం తెలిసిందే. అంతేనా.. ఆమె ఎక్క‌డ‌.. ఏ ప్రోగ్రాంలో పాల్గొన్నా జైశ్రీ‌రాం అంటూ నినాదం చేయాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఈ తీరున ప‌లువురు ప్ర‌ముఖులు ఖండిస్తున్నారు.

తాజాగా అలాంటి వారి జాబితాలో చేరారు ప్ర‌ముఖ సాహితీ వేత్త క‌మ్ నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత అమ‌ర్త్య సేన జైశ్రీ‌రాం నినాదంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ నినాదం బెంగాల్ సంప్ర‌దాయంలో లేద‌ని.. దీన్ని ప్ర‌జ‌ల‌ను కొట్ట‌టానికి వాడుతున్న‌ట్లుగా ఆయ‌న విమ‌ర్శించారు. తానెప్పుడూ ఈ నినాదాన్ని విన‌లేద‌న్నారు.

జాద‌వ్ పూర్ విశ్వ‌విద్యాల‌యంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడిన ఆయ‌న‌.. గ‌తంలో బెంగాల్ రాష్ట్రంలో శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌లు నిర్వ‌హించ‌టం విన‌లేద‌ని.. ఇప్పుడు అందుకు భిన్నంగా న‌వమి వేడుక‌ల్ని నిర్వ‌హిస్తున్నార‌న్నారు. ఒక మ‌తం ప్ర‌జ‌లు స్వేచ్ఛ‌గా జీవించ‌టానికి వీల్లేని రీతిలో.. వారిని భ‌య‌పెట్టేందుకు ఈ నినాదాన్ని వాడ‌టం తీవ్ర‌మైన చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. అంత‌ర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్ర‌ఖ్యాతులున్న వ్య‌క్తి నోటి నుంచి వ‌చ్చిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News