ప్రధానమంత్రి నరేంద్రమోడీపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను ఉగ్రవాదిగా జైపాల్ వర్ణించారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్ష పదవీ బాధ్యతల స్వీకరణ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లో ఎన్నో వర్గాలున్నాయని అయితే, ఇటీవల వాటిని కోల్పోయామన్నారు. అంజన్ కుమార్ తిరిగి వాటిని వర్గాలను ఒక్కటి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అందరిదని అయితే - సీఎం కెసిఆర్ ఒక్కరే చేసుకుంటున్నారని జైపాల్ రెడ్డి ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ స్నేహం చేస్తున్నారని, అది అక్రమ సంబంధమని జైపాల్ రెడ్డి ఆరోపించారు. మోడీ అంటే కేసీఆర్ ప్రేమ-భయం రెండూ ఉన్నాయని ఎద్దేవా చేశారు. తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయంలో మోడీ బిల్లును వ్యతిరేకించారని, అయినప్పటికీ మోడీపై కేసీఆర్ ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై కేసీఆర్ కు కృతజ్ఞతా భావన చూపడంలేదని మండిపడ్డారు. పెట్రోల్ ధరల విషయంలో కేంద్రం కప్పిపుచ్చుకునే దరోణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. ``అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉంటే ఆరేటు కట్టేందుకు వినియోగదారులు సిద్దంగా ఉన్నారు. అదేం లేదు...బీజేపీ కావాలని పెట్రో రేట్లు పెంచుతుంది. నరేంద్ర మోడీ పన్నులు వేసే ఉగ్రవాది`` అని జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019లో ఎర్రకోటపై కాంగ్రెస్ నాయకుడే జెండా ఎగురవేస్తారని జైపాల్ జోస్యం చెప్పారు.
రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచందర్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన పనుల గురించి చెప్పుకోవాలంటే మన దగ్గర 100 బాణాలు ఉన్నాయన్నారు. `రాజీవ్ ఆరోగ్యశ్రీ మనది,పీవీ ఎక్స్‌ప్రెస్‌వే మనది, ఆర్‌జీఐ ఎయిర్‌పోర్ట్ మనది,పేదలకు కూడు గుడ్డ కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని పార్టీ పిలుపును మనం అందరం కలిసి పనిచేయాలని కోరుతున్నాను. 2019లో మనం కచ్చితంగా విజయం సాధిస్తాం.`` అని అన్నారు. ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ హైద్రాబాద్‌లో కాంగ్రెస్ జెండా ఎగిరి రాష్ట్రంలో,కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఎర్రకోట మీద రాహుల్ గాంధీ జాతీయ జెండా ఎగరవేయాలని కోరారు. తెలుగు ప్రజలు కర్ణాటకలో బీజేపీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ ను గెలిపించారని అదే రీతిలో బీజేపీతో కుమ్మక్కు అయిన టీఆర్ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడిస్తారని జోస్యం చెప్పారు. టీఆరెస్ పార్టీ బీజేపీకి B టీం అని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఓడిపోవడం కంటే తెలంగాణలో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయామని రఘువీరా అన్నారు. 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఆయన కోరారు.