సాయిరెడ్డి కెలుకుడుతో జగనన్నకు గుచ్చుకుందే...

Update: 2022-10-16 11:21 GMT
ఎదుటి వారి మీద ట్వీట్ చేయడం బహు సులువు. తప్పులు పట్టుకుని ఎంచడం ఇంకా సులువు. కానీ ఆ ట్వీట్లు వెనక్కి తిరిగి చూస్తే తమకే గుచ్చుకుంటాయని కాస్త అయినా ఆలోచించకపోవడమే తప్పున్నర తప్పు. ఇపుడు అలాంటి పనే చేసి వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి ఏకంగా అధినేత జగన్ని ఇరకాటంలోకి నెట్టారు. ఏపీలోకి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రవేశించిన నేపధ్యంలో సాయిరెడ్డి ట్విట్టర్ చురుగ్గా పనిచేసింది. ఏపీని అడ్డగోలుగా విభజించిన వారు ఎలా అడుగుపెడతారు అని ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీకి ఈ విషయాన్ని ప్రజలే గుర్తు చేయాలంటూ కూడా ఆయన ట్వీట్ లో సూచించడం విశేషం.

అయితే అక్కడ ఉన్నది కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నేత  జై రాం రమేష్. ఆయన ఊరుకుంటారా. ఈ విభజనలో మీ హ్యాండ్ కూడా ఉంది అంటూ 2012 డిసెంబరు 28న కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండేకు అప్పటి వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేత ఎంవీ మైసురారెడ్డి, సెంట్రల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు కేకే మహేందర్‌రెడ్డి రాసిన లేఖను ట్విట్టర్ లో పోస్టు చేసి గట్టి రిటార్ట్ ఇచ్చారు. ఆనాటి లేఖలో ఏమి ఉంది అంటే 2011 జులై 8, 9వ తేదీల్లో జరిగిన పార్టీ ప్లీనరీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం మీరు ఏం చేసినా మాకు సమ్మతమే అని ఉంది.

అంతే కాదు, తెలంగాణ ప్రజల మనోభావాలను తమ పార్టీ గౌరవిస్తుందని చెబుతూ రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచడం, లేదా విభజించడంపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉంది అని పూర్తి అధికారాలు అప్పగించేశారు. అంటే కేంద్రం విభజన చేసినా తమకు సమ్మతమే అన్నట్లుగా నాడు లేఖ రాసి ఇపుడు చూస్తే తమ తప్పేమీ లేదని అంతా కేంద్రంలో అధికారంలో ఉన్న నాటి కాంగ్రెస్ సర్కారే చేసింది అని ఆరోపించడమే తప్పు అంటున్నారు జై రాం రమేష్.

పైగా ఈ లేఖ తన దగ్గర భద్రంగానే ఉంది అని ఆయన చెబుతూ పోస్ట్ చేశారు. దాంతో ఇన్నేళ్ళ తరువాత విభజన విషయంలో వైసీపీ హ్యాండ్ ఉందని మరోసారి బ్యాండ్ వేయడానికి జై రాం రమేష్ కి విజయసాయిరెడ్డి చాన్స్ ఇచ్చారన్న మాట. ఏదో ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఆయన మానాన వదిలేయవచ్చు కదా కోరి మరీ ట్వీట్ చేసి కెలికితే అది కాస్తా జగన్ మీదకే వెళ్ళింది. సో ఈ అతి ఉత్సాహమే ఇపుడు వైసీపీ నేతలు తగ్గించుకుంటే మంచిదేమో  అని అంటున్నారుట.
Tags:    

Similar News