ఫ్యూచర్లో తెలుగు రాష్ట్రాలు ఒక్కటవుతాయి..!!?

Update: 2019-07-31 07:33 GMT
సంచలన వ్యాఖ్య చేశారు మాజీ కేంద్రమంత్రి జైరాం రమేశ్. రెండు తెలుగు రాష్ట్రాల విభజన చట్టాన్ని తన స్వహస్తాలతో రాసిన పెద్ద మనిషి.. రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఏకమవుతాయని వ్యాఖ్యానించటం విశేషం. విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు కలవటం కాయమని.. విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాయని.. అవన్నీ పోవాలంటే మళ్లీ కలవటమే మార్గమన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

విభజన చట్టాన్ని దగ్గరుండి రాసిన జైరాం.. రెండు తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన ఐదేళ్లకే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ.. విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు కలిసేదెప్పుడు? దీనిపై జైరాంకున్న అంచనా ఏమిటన్న విషయాన్ని చూస్తే.. ఆయన ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఉన్నంత కాలం సాధ్యం కాకపోవచ్చని.. కానీ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం రెండు రాష్ట్రాల్ని ఒక్కటిగా చేయగలమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

తన వాదనకు ఉదాహరణగా జర్మనీ ఉదంతాన్ని ప్రస్తావించారు. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత జర్మనీ.. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటిగా ఏర్పడ్డాయని.. అదే రీతిలో ఉత్తర.. దక్షిణ కొరియాలు కూడా ఒక్కటిగా మారుతుంటాయని చెబుతుంటారని.. అదే రీతిలో రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిపోయేందుకు ఉద్యమం రావటం ఖాయమన్న మాట జైరాం నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది. జైరాం రమేశ్ చేసిన వ్యాఖ్యలపై రెండు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.


Tags:    

Similar News