అంత ఉలుకెందుకు పవన్... ?

Update: 2022-04-13 06:30 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ కి కోపం ఎక్కువే. ఆయన సినిమాల్లో కూడా ఎపుడూ సీరియస్ పాత్రలే వేస్తూ ఉంటారు. ఇక పవన్ ప్రసంగం కూడా ఆవేశపూరితంగా ఉంటుంది. అలాంటి పవన్ తనను ఎవరూ ఏమీ అనొద్దు అంటారు. ఆయన మాత్రం అందరినీ విమర్శిస్తారు అని వైసీపీ నేతలు అంటున్నారు అంటే వాస్తవం ఉంది కదా. రాజకీయాల్లో ఎలా ఉంటుంది అంటే ఒకటి అంటే పది పడాలి. పవన్ అయితే సభలలో తన అభిమాన జనాన్ని చూసి ఊగిపోతారు.

ఆ టైమ్ లో ఆయన తాట తీస్తా, తోలు తీస్తా, మోకాళ్ల మీద కూర్చోబెడతా అంటూ ప్రత్యర్ధులకు అలవోకగా  ఆటవిక శిక్షలను ప్రకటించేస్తూంటారు. సరే ఆయన సభ ఆయన ఇష్టం అని అనుకున్నా ఎదుటి పార్టీలని విమర్శిస్తే ఊరుకోరు కదా. మొత్తానికి అటు నుంచి కూడా పడుతూంటాయి. ఇక విషయానికి వస్తే పవన్ని చంద్రబాబు దత్తపుత్రుడు అని వైసీపీ కొన్నేళ్ళుగా వీర లెవెల్ లో ర్యాగింగ్ చేస్తోంది.

కానీ నాడు ఏమీ అనని పవన్ ఇపుడే కొత్తగా అంటున్నట్లుగా అనంతపురం టూర్ లో బిగ్ సౌండ్ చేశారు. నన్ను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే ఊరుకుంటానా, జగన్ని సీబీఐ దత్తపుత్రుడు అని నేను అనలేనా అని బాగానే రిటార్ట్ ఇచ్చారు. అంతవరకూ ఓకే అనుకున్నా నన్ను కానీ నా పార్టీని కానీ విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదనేశారు. మీరు విమర్శలు చేస్తే ఊరుకోను అని కూడా వార్నింగ్ ఇచ్చేశారు.

నిజానికి రాజకీయాల్లో అన్ని అర్హతలు చూసుకునే విమర్శలు చేస్తున్నారా. ఎవడికి కాలితే వాడు పీఎం, సీఎం అని కూడా చూడకుండా చెడామడా అనేసే చేటు కాలం రాజకీయాల్లో నడుస్తోంది. నేను వ్యక్తిగత విషయాల జోలికి పోను, విధానాల మీద విమర్శలు చేస్తాను అనే పవన్ కళ్యాణ్ అవంతి పూబంతి, వెల్లంపల్లి వెల్లుల్లి, అంబటి రాంబాబుల మీద జనసేన ఆవిర్భావ సభలో  చేసిన కామెంట్స్ ఏమనాలి. ఆయన జగన్ జైలు అంటూ పదే పదే అనవచ్చా అని వైసీపీ నేతలు అంటే జవాబు ఏం చెప్పగలరు.

ఇవన్నీ కూడా పక్కన పెట్టినా అసలు పవన్ పొలిటికల్ వ్యూహాలు ఏంటి. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారు అన్నది కూడా ఆలోచిస్తారు కదా. మరో వైపు  టీడీపీ గురించి  పవన్  పల్లెత్తు మాట అనడంలేదు. ఇవన్నీ వైసీపీ వారు మాట్లాడకూడదు అనుకున్నా సామాన్య జనాల్లో చర్చగా ఉండవా. బీజేపీతో నిజానికి జనసేనకు పొత్తు ఉంది. ఆయన చంద్రబాబును టీడీపీని పల్లెత్తు మాట అనకుండా ఉంటే దాన్ని ఎలా అర్ధం చేసుకుంటారు.

అదే విధంగా నాడు అయిదేళ్ళ చంద్రబాబు పాలనలో ఎన్నో తప్పులు జరిగాయి. నాడూ రైతులు చనిపోయారు. నాడూ ఆత్మహత్యలు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి. సమస్త ఇబ్బందులు, పన్నుల బాదుడూ అన్నీ ఉన్నాయి. మరి నాడు ఒక్క మాట కూడా  అనకుండా నేడు కేవలం వైసీపీని విమర్శిస్తే అధికార పార్టీని  అలా వదిలేసినా సగటు జనాలు పవన్ రాజకీయాన్ని ఎలా అర్ధం చేసుకుంటారు.

ఈ రోజుకీ టీడీపీతో పొత్తు ఉండదు అని పవన్ చెప్పడం లేదు కదా. నేను ఎవరికీ బీ టీం కాదు అని మాత్రమే అంటున్నారు. పొత్తులు పెట్టుకునే స్వేచ్చ రాజ్యాంగం ఇచ్చింది. హ్యాపీగా  ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కూడా. దానికి ముసుగులో గుద్దులాట ఎందుకు. ఎవరో అన్నారని ఉలికిపాటు ఎందుకు. ఇదీ మా విధానం, గత  టీడీపీ పాలన అయిదేళ్ళూ బాగుంది. కాబట్టి ఆ పార్టీతో మేము వచ్చే ఎన్నికల్లో కలసి వెళ్తున్నామని పవన్ ధైర్యంగా  చెప్పవచ్చు కదా.

ఎటూ తేల్చక కన్ఫ్యూజన్ లో తాను ఉంటూ అవతల వారు మాత్రం తనను ఏదీ అనవద్దు అంటే ఇదేంటి పవన్ నీ పాలిటిక్స్ అని అనుకోరా. మొత్తానికి పవన్ కళ్యాణ్ జవాబు మాటలలో చెప్పారు, కానీ దాన్ని చేతలలో చూపిస్తే వైసీపీ ఇక మీదట ఒక్క మాట పల్లెత్తి అంటే ఒట్టు అన్నట్లుగా సీన్ ఉంటుంది. అలాగే సగటు జనాలకు పవన్ రాజకీయాలు పూర్తిగా అర్ధమవుతాయి.
Tags:    

Similar News