బోళాగా బోల్డుగా కీలక నేత... జనసేనకు చిక్కులేనా... ?

Update: 2022-03-16 23:30 GMT
జనసేనలో విధానపరమైన నిర్ణయాల గురించి ఎక్కువగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది ఆ పార్టీ  రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రమే. ఆయన జనసేన పార్టీకి  సర్వ సహాగా ఉన్నారు. ఏ చిన్న విషయం మీద అయినా నాదెండ్ల క్లారిటీ ఇస్తే అది పవన్ నోటి నుంచి వచ్చినట్లే లెక్క.  అలాంటి నాదెండ్ల వంటి వారు పొత్తుల విషయం ఆలోచిస్తున్నామని ఇప్పటికే చెప్పారు.

ఇక జనసేన ఆవిర్భావ సభలో పవన్ వైసీపీ వ్యతిరేక ఓటు ఏ ఒక్కటీ చీలకుండా చూస్తామని భీషణ ప్రతిన చేశారు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి అర్ధమయ్యే విషయాలు. కానీ విశాఖకు చెందిన కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ ఉరఫ్ సత్యకు  మాత్రం ఇవి ఎలా అర్ధమయ్యాయో కానీ ఆయన మాత్రం కాస్తా టోన్ డిఫరెంట్ అన్నట్లుగా నో పొత్తులు నో ఎత్తులూ అని కాస్తా  గట్టిగానే మాట్లాడుతున్నారు. అదే ఇపుడు జనసేన  పార్టీలో చర్చగా ఉందని  ప్రచారం సాగుతోంది.

నిజానికి  టీడీపీతో జనసేనకు పొత్తు ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఇక చూస్తే  ఇదేమీ కొత్త విషయం కూడా కాదు, గతంలో పొత్తు ఉంది. ఇక లోకల్ బాడీ ఎన్నికలు ఈ మధ్యనే జరిగాయి. గోదావరి జిల్లాల్లో కూడా రెండు పార్టీలు కలసి పనిచేశాయి. విషయం ఇలా ఉంటే బొలిశెట్టి మాత్రం అబ్బే అదేమీలేదు మేము ఒంటరిగానే పోటీ చేస్తామని  చెప్పడం విశేషం.

తెలుగుదేశంతో మాకు పొత్తేమిటి అంటూ బొలిసెట్టి బోల్డ్ గా స్టేట్మెంట్స్ ఇచ్చేస్తున్నారు. అంతే కాదు, టీడీపీ మీద చంద్రబాబు మీద లోకేష్ మీద పవన్ గతంలో చేసిన కామెంట్స్ వెనక్కు తీసుకోలేదు అని కూడా అంటున్నారు. ఇక పక్కా కుటుంబ పార్టీ టీడీపి అని నిప్పులు చెరుగుతున్నారు.  మాకు వైసీపీ ఎలాగో టీడీపీ కూడా  అలాగే అని భోళాగా మాట్లాడేస్తున్నారు.  నిజానికి వైసీపీ అంటేనే జనసేన నేతలు మండిపడతారు. వారికి టీడీపీ మీద సాఫ్ట్ కార్నర్ ఉందని కూడా చెబుతారు.

ఇక టీడీపీ తమ్ముళ్ళు కూడా జనసేన‌తో పొత్తు ఉందని కన్ ఫర్మ్ అయిన వేళ బొలిశెట్టికి పవన్ స్పీచ్ ఎంతవరకూ అర్ధమైంది అన్నదే చర్చగా ఉంది. పైగా ఇదంతా టీడీపీ అనుకూల మీడియా ప్రచారం, ఎల్లో మీడియా సృష్టి అంటూ ఫైర్ అవుతున్నారు బొలిశెట్టి వారు.

టీడీపీ పొత్తుల కోసం ఎదురుచూసే పార్టీ అందుకే మైండ్ గేమ్ ఆడుతున్నారు అని బొలిశెట్టివారు సెలవిస్తున్నారు. ఇక టీడీపీ మీద ఆయన ఏ జనసేన నేత అనని విధంగా హాట్ హాట్ కామెంట్స్ చేయడమే లేటెస్ట్ విడ్డూరం. టీడీపీ పొత్తులతోనే బతుకుతుందిట. నిజంగా ఇంతకంటే ఘాటు వ్యాఖ్య వేరేది ఉంటుందా.

పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్ధి అని మేము చెప్పేశాక ఇక వ్యతిరేక ఓటు చీల్చే సమస్య ఎక్కడ ఉంటుంది అని బొలిశెట్టి అంటున్నారు. ఇలా బొలిశెట్టి మీడియాలో తనదైన టీకా తాత్పర్యాలు చెబుతూ జనసేన సభలో పవన్ మాట్లాడిన దానికిభాష్యం చెప్పడం అయితే ఆ పార్టీకి ఇబ్బందిగానే ఉంది అంటున్నారు.

సరే ఈ రోజుకు అయినా టీడీపీతో జనసేనకు పొత్తు లేదు అనుకున్నా కూడా రేపటి రాజకీయ అవసరాలను బట్టి చూసుకున్నా ఆ పార్టీని ఏమీ అనకూడదు కదా. అది కదా అసలైన  వ్యూహం అంటే.  ఏపీలో విపక్ష పార్టీలలో టీడీపీ పెద్ద పార్టీ కదా. మరి అన్నీ తెలిసి బొలిశెట్టి ఇలా మాట్లాడుతున్నారు అంటే జనసేనలో డిఫరెంట్ వాయిసా. లేక ఆయన మాటే నిజమా. ఏది సత్యం, ఏది అసత్యం, చెప్పు బొలిశెట్టి సత్యా అనాల్సి వస్తోంది  రాజకీయ జనాలు.  మరి  బొలిశెట్టి సత్య వాక్కుల మీద జనసేన ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    

Similar News