పవన్ భయపెడతాడు... జగన్ భయపడతాడు: జనసైనికుల నిప్పులు!

Update: 2023-05-17 08:22 GMT
మర్యాద అన్నది లేకుండా ఎంత మాట పడితే అంత మాట అనేస్తున్న వైనం ఏపీ రాజకీయాల్లో అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఎన్నికలు ఏడాదికి వచ్చేసిన వైనం ఒక పక్క.. అన్ని అనుకున్నట్లుగా.. అంచనాలకు తగ్గట్లుగా జరిగితే.. ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు.. ఏపీ కూడా వెళుతుందన్న మాటలు బలంగా వినిపిస్తున్న వేళ.. రాజకీయం అంతకంతకూ రగులుకుంటోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చిన పొత్తుల లెక్క.. ముఖ్యమంత్రి పదవిపై తన స్టాండ్ ఏమిటో తేల్చేయటం తెలిసిందే.

బలం లేకుండా ముఖ్యమంత్రి పదవిని ఆశించటం సరికాదంటూ తన పార్టీ నేతలకు ఓపెన్ గా చెప్పేయటం తెలిసిందే. ఇలాంటి వేళ.. పవన్ నోటి నుంచి వచ్చిన పొత్తుల మాటకు ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. చంద్రబాబుకు పవన్ దాసోహం అయ్యారని.. ఆయన ఎజెండాకు తగ్గట్లే పని చేస్తున్నారని.. ప్యాకేజీ స్టార్ అంటూ విరుచుకుపడ్డారు. తాజాగా బాపట్ల జిల్లాలో పవన్ మీదా.. చంద్రబాబు మీద ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలపై జనసైనికులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు. సీఎం జగన్ కు కొత్త పేర్లు పెట్టి సోషల్ మీడియాలో పాపులర్ కావాలన్నట్లుగా జనసైనికుల తీరు కనిపిస్తోంది. అంతేకాదు.. తమ అధినేత గురించి వారు గొప్పగా అభివర్ణిస్తూ.. 'పవన్ భయపెడతాడు.. జగన్ భయపడతారు' అని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి వారు ఘాటుగా రియాక్టు అవుతూ.. తమ మాటలతో సంచలనంగా మారాలన్నట్లుగా వారి మాటలు ఉంటున్నాయి. ముఖ్యమంత్రి జగన్.. బటన్ రెడ్డిగా మారారని.. అర్థం లేని మాటలతో బఫూన్ రెడ్డి అయ్యారంటూ జనసైనికులు నిప్పులు చెరుగుతున్నారు. పవన్ తేల్చిన పొత్తుల లెక్కతో జగన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామని అర్థమైందని.. అందుకే ఫస్ట్రేషన్ తో స్థాయి మరిచి ప్రేలాపనులుచేస్తున్నారంటూ మండిపడుతున్నారు. తిరుపతి అసెంబ్లీ జనసేన పార్టీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. దాన గుణం గురించి జగన్ చెబితే జనాలు నవ్వుకుంటున్నారని.. పిల్లికి కూడా బిచ్చం పెట్టని జగన్.. పవన్ గురించి మాట్లాడతారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

''వచ్చే ఎన్నికల్లో ఓటమి భయం ముఖ్యమంత్రి కళ్లలో కనిపిస్తోంది. బాపట్లలో ఈ రోజు సీఎం మాట్లాడిన తీరు.. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత మాట్లాడిన వ్యక్తి తీరు మాదిరిగానే ఉంది.  పవన్ కళ్యాణ్  మాట్లాడే ప్రతి మాట జగన్ రెడ్డిని భయపెడుతోంది. ఆయన్ను తలుచుకొని రాత్రిళ్లు ఆయనకు నిద్ర కూడా రాని పరిస్థితి ఉన్నట్లు అనిపిస్తోంది. కచ్చితంగా వచ్చే రోజుల్లో 'పవన్ భయపెడతాడు... జగన్ భయపడతాడు'. భయాన్ని కేజీల్లో కాదు... టన్నుల్లో జగన్ కు ఇవ్వబోతున్నాం. సీఎం మాట్లాడే తీరు చూస్తుంటే సర్కస్ లో బఫూన్ మాదిరి కనిపిస్తోంది. ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి సుపరిపాలన ఇవ్వమంటే.. అది చేతకాక బటన్లు నొక్కడమే తన పని అంటున్న ఈ ముఖ్యమంత్రి తీరు సిగ్గుతో తలదించుకునేలా ఉంది'' అని మండిపడ్డారు.

రాజధాని అమరావతిలో పవన్ కళ్యాణ్ భూమి కొనుగోలు చేస్తే, ఇన్నర్ రింగురోడ్డులో అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని.. బోడి గుండుకు మోకాలికి ముడిపెట్టి మాట్లాడుతున్నారన్నారు. ''అమరావతి రైతులను అన్ని విధాలా మోసం చేసిన వ్యక్తి జగన్ రెడ్డి. ఎప్పుడు ఎక్కడికి పారిపోవాలో తెలియక, తాడేపల్లిలో జాతీయ రహదారికి దగ్గర్లో రాజసౌధం నిర్మించుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. రాజధాని లేని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తిగా, రాష్ట్రంలో 3 వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పట్టించుకోని వ్యక్తిగా జగన్ రెడ్డి మిగిలారు.

దానగుణం గురించి సీఎం మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. సొంత డబ్బును కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకు పంచుతున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎక్కడ? పిల్లికి కూడా భిక్షం పెట్టని జగన్ రెడ్డి మనస్తత్వం ఎక్కడ?  ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మునంతా ఇడుపులపాయ ఎస్టేట్ లో దాచుకున్న జగన్ రెడ్డి అవినీతిని ప్రజల ముందు ఉంచుతాం'' అంటూ ఫైర్ అయ్యాయి. జనసైనికుల మాటలు ఇప్పుడుసంచలనంగా మారాయి.

Similar News