ఎంపీటీసీ నామినేష‌న్ల‌లోనే చేతులెత్తేసిన జ‌న‌సేన‌!

Update: 2020-03-13 11:44 GMT
ఇప్ప‌టికే నామినేష‌న్ల ప‌ర్వం ముగిసిన ఎంపీటీసీ ఎన్నిక‌ల విష‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన‌ - భార‌తీయ జ‌న‌తా పార్టీల‌ది కేవ‌లం గెస్ట్ అప్పీరియ‌న్స్ మాత్ర‌మే అనే ప‌రిస్థితి అగుపిస్తూ ఉంది. ఎంపీటీసీ స్థానాల‌కు ఏపీ వ్యాప్తంగా దాదాపు 50వేల నామినేష‌న్లు దాఖ‌లు అయితే వాటిల్లో జ‌న‌సేన వాటా కేవ‌లం రెండు వేలు మాత్ర‌మ అని తెలుస్తోంది. మొత్తం 9 వేల‌కు పైగా ఉన్న ఎంపీటీసీ స్థానాల్లో జ‌న‌సేన కేవ‌లం రెండు వేల స్థానాల‌కు మాత్ర‌మే నామినేష‌న్ల‌ను దాఖ‌లు చేసిన‌ట్టుగా స‌మాచారం.

ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌-బీజేపీలు పొత్తు పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. మ‌రి మిగ‌తా స్థానాల‌కు బీజేపీ ఏమైనా నామినేష‌న్లు దాఖ‌లు చేసిందా - అంటే అది కూడా లేదు. బీజేపీ కేవ‌లం 1800 స్థానాల‌కు మాత్ర‌మే నామినేష‌న్ల‌ను వేసిన‌ట్టుగా తెలుస్తోంది. ఇలా జ‌న‌సేన‌ - బీజేపీల త‌ర‌ఫున మొత్తం నాలుగు వేల నామినేష‌న్లు కూడా దాఖ‌లు కాలేదు!

స‌గానికి స‌గం స్థానాల్లో ఈ పార్టీ త‌ర‌ఫున నామినేష‌న్లు కూడా ప‌డ‌లేదు. నామినేష‌న్లు దాఖ‌లు చేయిన చోట ఎంత‌మంది ఆఖ‌రి వ‌ర‌కూ బ‌రిలో నిలుస్తారు, ఎంత‌మంది ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తారు అనేది వేరే సంగ‌తి. జ‌నసేన‌, బీజేపీ క‌లిసి కూడా స‌గం ఎంపీటీసీ స్థానాల‌కు క‌నీసం నామినేష‌న్ల‌ను కూడా దాఖ‌లు చేయ‌లేక‌పోవ‌డం మాత్రం ఆ పార్టీల ఫెయిల్యూర్ అని చెప్ప‌వ‌చ్చు.

మొన్నామ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌ర్నూలు వెళ్లి త‌న స‌భ‌లకు ల‌క్ష‌ల మంది జ‌నాలు వ‌చ్చిన‌ట్టుగా త‌నే చెప్పుకున్నారు. వారి ఉత్సాహం చూస్తే ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే త‌నే ముఖ్య‌మంత్రి అనేంత లెవ‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. క‌ట్ చేస్తే స్థానిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప‌టిమ బ‌య‌ప‌డుతూ ఉంది. 9 వేల ఎంపీటీసీ స్థానాల‌కు గానూ రెండు వేల చోట్ల నామినేష‌న్లు దాఖ‌లు  చేసింది ఆ పార్టీ. మ‌రి గెలిచేది ఎన్ని చోట్ల‌? అంటే అది వేరే సంగ‌తి!
Tags:    

Similar News