వారు కలిసిపోతే అంతే సంగతులు

Update: 2015-05-23 05:50 GMT
కొందరు రాజకీయ నాయకులను చూస్తే ముచ్చటేస్తుంది. వాళ్ల ఆలోచన జానెడు ఆశ బారెడు. మనదగ్గర ఉన్న సరుకేంటనే ప్రశ్న కంటే... ఏమైనా చేయగలం అనే అతివిశ్వాసం ఎక్కువ ఉంటుంది. అలాంటి అతివిశ్వాసం కలిగిన నాయకులంతా కలిసి ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎదుర్కునేందుకు జనతా పరివార్‌ పేరుతో ఓ వేదికకు రంగం సిద్ధం చేశారు. జనతా పేరుగల పార్టీలన్నీ విలీనం అయి బీజేపీపై సమరం చేయాలనేది కాన్సెప్ట్.

అయితే ఆ పార్టీల విలీన ప్రక్రియ పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. విలీనంపై స్పష్టత ఇచ్చేందుకు కీలక భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఆర్జేడీ చీప్ లాలూ ప్రసాద్, సమాజ్‌వాదీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్, శరద్ యాదవ్ మధ్య ఈ భేటీ జరిగింది. ఇంతటి కీలక సమావేశానికి బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ డుమ్మా కొట్టారు. నితీశ్  కంటికి చిన్న సర్జరీ జరిగిందని, వైద్యులు విశ్రాంతి తీసుకోవాలనడంతో భేటీకి రాలేదని పార్టీ వర్గాలు చెపుతున్నప్పటికీ కావాలనే హాజరుకాలేదని సమాచారం. బీజేపీపై పోరులో కలవాలని జేడీయూ బహిష్కరించిన మాజీ సీఎం జితన్‌రాం  మాంఝీని లాలూ ఆహ్వానించడం నితీశ్‌కు మింగుడుపడ్డం లేదని, అందుకే ఈ విధంగా నిరసన గళం వినిపిస్తున్నారని భావిస్తున్నారు.

మరోవైపు ఈ భేటీలో లాలూ ఆర్జేడీ, జేడీయూ విలీనం సంగతి పక్కనబెట్టి మాంఝీని ఆహ్వానించే ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు సమాచారం.బీజేపీకి వ్యతిరేకంగా ఎన్డీఏయేతర, లెప్ట్‌ను కలుపుకొని ‘మహా కూటమి’ ఏర్పాటు చేయాలని ఆయన సూచించినట్లు సమాచారం. ఆర్జేడీ, జేడీయూ విలీనంపై లాలూ ఆసక్తిగా లేరని, ఈ రెండు పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశంలో ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇలా....తాము కలిస్తే మోడీ అడ్రస్ గల్లంతు అని పలికిన నేతలు సమావేశంలోనే కలిసిపోకుంటే...పోరాటం ఎప్పుడు చేస్తారనే సందేహాలు కలుగుతున్నాయి.

కొసమెరుపు: బీజేపీకి వ్యతిరేకంగా తమతో కలవాల్సిందిగా ఓవైపు లాలూ ఆహ్వానిస్తుండగా బిహార్ మాజీ సీఎం మాంఝీ ప్రధాని నరేంద్రమోడీకి  దగ్గరయ్యేందుకు యత్నిస్తున్నారు. ఈనెల 25-28 మధ్య తనకు అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా మోడీ ని కోరారు. నితీశ్ ఉన్న ఏ కూటమి, పార్టీలో చేరబోనని మాంఝీ కరాఖండీగా తేల్చిచెప్పారు.
Tags:    

Similar News