అనూహ్య ప‌రిణామం: అమ్మ వీడియో విడుద‌ల‌

Update: 2017-12-20 07:07 GMT
ఇప్ప‌టివ‌ర‌కూ చెప్పిన మాట‌లు మ‌ర్చిపోయారు. అమ్మ‌ను ఆసుప‌త్రిలో ఉన్న దృశ్యాన్ని చూస్తే ఆమె అభిమానులు గుండె ప‌గిలిపోతుంద‌ని.. తీవ్ర మ‌నోవేద‌న‌కు గురి అవుతారంటూ చెప్పి.. వీడియో త‌ర్వాత సంగ‌తి ఫోటో కూడా విడుద‌ల చేయ‌టానికి ఇష్ట‌ప‌డ‌ని అమ్మకు అత్యంత స‌న్నిహితంగా ఉన్న చిన్న‌మ్మ అండ్ కో తాజాగా ఆ మాట‌ల్ని మ‌ర్చిపోయారు.

స్పృహ లేని వేళ‌.. అమ్మ‌ను అపోలో ఆసుప‌త్రిలోకి తీసుకొచ్చార‌ని.. చాలా భారీ నాట‌కం ఆడారంటూ ఏవేవో ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. మౌనంగా ఉన్న చిన్న‌మ్మ వ‌ర్గం.. అమ్మ మ‌ర‌ణం కార‌ణంగా కాళీ అయిన ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు ఒక్క రోజు ముందుగా అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకునేలా వ్య‌వ‌హ‌రించారు.

అమ్మ మ‌ర‌ణానికి కొన్ని రోజుల ముందు ఆమె ఎలా ఉన్నార‌న్న విష‌యాన్ని చెప్పే వీడియోను బ‌య‌ట‌కు విడుద‌ల చేసి సంచ‌ల‌నం సృష్టించారు. చిన్న‌మ్మకు బంధువువైన దిన‌క‌రన్‌కు స‌న్నిహితుడైన పి. వెట్రివేల్ తాజాగా అమ్మ వీడియోను విడుద‌ల చేశారు.

ఆయ‌న విడుద‌ల చేసిన వీడియోలో ఆసుప‌త్రి బెడ్ మీద ఉన్న అమ్మ‌.. డ్రింక్ తాగుతూ ఉన్న దృశ్యం క‌నిపించింది. చెదిరిన వ‌స్త్రాలు.. మోచేతికి బ్యాండేజ్ తో పాటు.. మెడ‌లో వేలాడుతున్న గ్రీన్ మౌత్ కాప్ ఉండ‌గా.. నిదానంగా చేతిలో ఉన్న డ్రింక్ ను సిప్ చేయ‌టం క‌నిపిస్తుంది. తాజా వీడియోతో ఆసుప‌త్రిలో అమ్మ చికిత్స పొంద‌టం నిజం.. కోలుకోవ‌టం నిజం.. స్సృహ‌తో ఉన్నార‌న్నదినిజ‌మ‌న్న భావ‌న క‌లిగేలా వీడియో ఉండ‌టం గ‌మ‌నార్హం.

వీడియో విడుద‌ల సంద‌ర్బంగా వెట్రివేల్ మాట్లాడుతూ.. అమ్మ‌ను ఆసుప‌త్రిలో క‌ల‌వ‌లేద‌న్నది అవాస్త‌వ‌మ‌ని చెప్పారు. ఆసుప‌త్రిలో అమ్మ చికిత్స పొందుతున్న‌ప్పుడు శ‌శిక‌ళే స్వ‌యంగా వీడియో తీసిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. ఈ వీడియోలు త‌మ‌తో పాటు రాష్ట్ర ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి.. ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వ‌ద్ద కూడా ఉన్న‌ట్లు చెప్పారు.

అమ్మ మ‌ర‌ణంతో ఖాళీ అయిన  ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక‌కు సంబంధించి కీల‌క‌మైన పోలింగ్ రేపు జ‌ర‌గ‌నుంది. అమ్మ వ‌ర్గం త‌ర‌ఫున దిన‌క‌ర‌న్ బ‌రిలో ఉన్నారు. అమ్మ అప‌స్మార‌క స్థితిలో ఉన్న వేళ గ‌త ఏడాది సెప్టెంబ‌రు 22న చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో  చేర్చారు. రెండు నెల‌ల‌కు పైగా ఆసుప‌త్రిలో ఉన్న అమ్మ చికిత్స పొందుతూ గ‌త ఏడాది డిసెంబ‌రు 5న తుదిశ్వాస విడిచారు. ఆమె ఆసుప‌త్రిలో ఉన్న వేళ ఎవ‌రిని ఆమెను ప‌రామ‌ర్శించేందుకు అనుమ‌తించ‌లేదు. ఆమెను క‌లిస్తే ఇన్ఫెక్ష‌న్ సోకి అనారోగ్యానికి గురి అవుతారంటూ ఎవ‌రిని అనుమ‌తించ‌లేద‌ని చెప్పారు. అమ్మ మ‌ర‌ణంపై పెద్ద ఎత్తున అనుమానాలు.. సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. త‌మ నిజాయితీని చాటుకునేలా చిన్న‌మ్మ వ‌ర్గం తాజాగా ఈ వీడియోను విడుద‌ల చేసింది. మ‌రి.. దీనికి కౌంట‌ర్ గా ప‌ళ‌ని.. ప‌న్నీరు వ‌ర్గం మ‌రేదైనా వీడియో విడుద‌ల చేస్తుందో చూడాలి.

Full View

Tags:    

Similar News