జగన్‌ గూటికి జేసీ చేరతారా? ఆ కామెంట్ల అర్ధమదేనా?

Update: 2020-03-16 10:42 GMT
ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్లతో మీడియాముందుకొచ్చే జేసీ దివాకర్‌రెడ్డి మరోమారు తనదైన స్టైల్‌ చాటారు. సీఎం జగన్‌ను ఉద్దేశించి ఇన్‌ డైరెక్టుగా చలోక్తులు పేల్చారు. దగ్గరుండి ఆ కామెంట్లు విన్న మీడియా ప్రతినిధులకు - టీవీల ముందున్న ప్రేక్షకులకు పిచ్చెక్కిపోయింది. ఎందుకంటే, ఆయన జగన్‌ ను పొగిడారో - తెగిడారో ఎవరికీ అర్ధం కాలేదు. విషయానికి వస్తే - సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్‌ తో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు కమిషనర్‌ ఛాంబర్‌ లోనే ఉన్నారు. ఈ సంగతి తెలుసుకున్న మీడియా మిత్రులు సైతం అక్కడికి చేరారు. వారితో జేసీ మాట్లాడారు.

‘‘ రాష్ట్రంలో ఎవ్వరూ ఉండకూడదు.. బ్రహ్మ - విష్ణు - మహేశ్వరులు కూడా ఒక్కరే అయివుండాలి... త్రిమూర్తులు ఒక్కరే ఉండి పోలీసులు తోడుంటే సరిపోతుంది" అన్నారు. అంతలోనే.." రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడు… తన నెత్తి మీద తానే చేయి పెట్టుకుంటున్నాడు.. ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసు’’ అంటూ ముగించారు. ఇంతకీ ఆయన ఎవరో చెప్పండని మీడియా ప్రతినిధులు అడిగితే, ‘‘ ఆయనెవరో మీకు కూడా తెలుసు ’’ అంటూ దాటవేశారు. ఎన్నికల కమిషనర్‌ తో ఏం మాట్లాడారని అడిగితే... "రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను కుదించడం స్వాగతించదగినదే... దాని వల్ల మద్యం - డబ్బు పంపిణీ తగ్గుతుంది అన్నారు. అంతేకాదు, టీడీపీలో ఉన్నంత మాత్రాన ప్రతిదాన్నీ విమర్శించాలని లేదు... ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైనవారు.. ప్రతి ఒక్కరికీ సామాజిక వర్గం ఉంటుంది.. లేనివారు ఎవరో చెప్పండి చూద్దాం" అన్నారు. ఇంతకీ జేసీ దివాకర్‌ రెడ్డి ఏం చెప్పాలనుకుంటున్నారంటూ విలేకరులు బుర్రలు గోక్కున్నారు. ఆయన భస్మాసురుడు అన్నది జగన్నేనా? జగన్నే అనుకుంటే.. భస్మాసురుడన్న కామెంట్‌ తోపాటు.. చాలా తెలివైనవాడని కూడా ఓ ప్రశంస విసిరారు. దీన్నెలా తీసుకోవాలి..? తిట్టినట్లా - పొగిడినట్లా? అందరికీ సామాజికవర్గం ఉంటుందన్న మాట వెనుకున్న గూడార్థం ఏమిటి? తన కులమే అయిన జగన్‌ మోహన్‌ రెడ్డితో జాయినవుతానని హింట్‌ ఇచ్చినట్లా..? మళ్లీ జేసీయే వచ్చి ఈ చిక్కుముడులు విప్పాలి.
Tags:    

Similar News