ఎయిర్ పోర్టులో జేసీ వీరంగం

Update: 2017-06-15 08:27 GMT
అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ హడావుడే. తాజాగా, విశాఖ విమానాశ్రయంలో ఆయన వీరంగమాడారు.  ఇండిగో విమానంలో ఆయన హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. అయితే బోర్డింగ్ పాస్ జారీ చేసే సమయం అయిపోవడంతో కౌంటర్ ను మూసేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన జేసీ... కౌంటర్ లోని ప్రింటర్ ను తోసేశారు. ఆయన అనుచరులు ఆయనను ఆపడంతో, కాసేపటికి ఆయన చల్లబడ్డారు.
    
కాగా.... జేసీ తీరుపై ఎయిర్ పోర్టు సిబ్బంది ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు జేసీ దివాకర్ రెడ్డి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. కానీ అప్పటికే ఆలస్యమైంది. సమయం మించిపోయిందని కుదరదని బోర్డింగ్ పాస్ ఇవ్వలేమని సిబ్బంది చెప్పడంతో ఎంపీ రెచ్చిపోయారు.
    
కాగా గతేడాది కూడా జేసీ ఇలా విమానాశ్రయాల్లో వీరంగమాడిన సందర్భాలున్నాయి. ఓసారి విజయవాడ ఎయిర్‌పోర్టులో సిబ్బందిని కొట్టినంత పనిచేసిన జేసీ దివాకర్ రెడ్డి… అక్కడి కంప్యూటర్‌ను కూడా ధ్వంసం చేశారు. అయితే ఆయన అధికార పార్టీ ఎంపీ కావడంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయితే.. ఈసారి విశాఖలో విమానాశ్రయ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఏమవుతుందో చూడాలి. కొద్ది రోజుల క్రితం శివసేన ఎంపీ గ్రైక్వాడ్‌ ఈ తరహాలోనే విమాన సిబ్బందిపై దురుసగా ప్రవర్తించారు. దాంతో ఆయన్ను విమానాల్లో ప్రయాణించకుండా కొద్దికాలం పాటు విమానయాన సంస్థలు ఆంక్షలు కూడా విధించాయి.  గతంలో ఎయిర్ పోర్టు అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మ‌రి అధికార పార్టీ ఎంపీ జేసీ చేసిన హంగామాకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News