పొగుడుతూనే బాబుకు పంచ్‌లు వేసిన జేసీ!

Update: 2018-05-30 05:24 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లో జేసీ దివాక‌ర్ రెడ్డి పేరు తెలీనివారు ఉండ‌రు. మ‌న‌సులో అనిపించిన ఏ విష‌యాన్ని ఆయ‌న నోటి నుంచి చెప్ప‌కుండా ఉండ‌లేరు. ఒక‌సారి ఫిక్స్ అయితే.. ముఖ్య‌మంత్రికి సైతం బ‌హిరంగంగా స‌ల‌హాలు ఇచ్చేందుకు వెనుకాడ‌రు. పొగుడుతూనే పంచ్ లు వేసే తీరు ఆయ‌న‌లో ఎక్కువే.

తాజాగా అలాంటి తీరునే ప్ర‌ద‌ర్శించారు జేసీ. మూడు రోజులుగా ఆర్భాటంగా నిర్వ‌హించిన మ‌హానాడులో బాబుకు పంచ్ లు వేసేందుకు ఏ మాత్రం మొహ‌మాట‌ప‌డ‌లేదు జేసీ దివాక‌ర్ రెడ్డి. బాబు ప‌రోక్షంలో ఆయ‌న‌లోని లోపాల్ని అదే ప‌నిగా మాట్లాడుకునే తెలుగు త‌మ్ముళ్ల తీరుకు భిన్నంగా..  అధినేత ముఖం మీద‌నే ఆయ‌న లోపాల్ని చెప్పేశారు. తీరు మార్చుకోవాల‌న్న మాట‌ను చెప్ప‌టం ద్వారా మిగిలిన వారికి తానెంత భిన్న‌మ‌న్న విష‌యాన్ని జేసీ త‌న తీరుతో మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

మ‌హానాడు సంద‌ర్భంగా అధినేత మొద‌లు సాధార‌ణ కార్య‌క‌ర్త వ‌ర‌కూ అంద‌రిని ఉద్దేశిస్తూ మాట్లాడే అవ‌కాశాన్ని కొంద‌రు చేజిక్కించుకున్నారు. అలాంటి వారిలో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి ఒక‌రు. మ‌హానాడులో ప్ర‌సంగించిన ఆయ‌న ఏకంగా బాబు తీరును త‌ప్పు ప‌ట్టారు. త‌ప్పులు స‌రిదిద్దుకోవాలంటూ సూచ‌న‌లు చేశారు. అదే ప‌నిగా బాబు నిర్వ‌హించే టెలీ కాన్ఫ‌రెన్స్ ల మీద వ్యాఖ్య‌లు చేసిన ఆయ‌న‌.. టెలీ కాన్ఫ‌రెన్స్ ల్ని మానుకోవాల‌ని.. కావాలంటే క‌లెక్ట‌ర్ల‌తో నేరుగా మాట్లాడాల‌న్న సూచ‌న చేశారు.

మాకు ఎవ్వ‌రూ దొర‌క‌టం లేదు. ఆర్డీవో నుంచి ప్యూన్ వ‌ర‌కూ అంద‌రూ టెలీ కాన్ఫ‌రెన్స్ అంటున్నార‌ని.. జ‌న్మ‌భూమి క‌మిటీలు వ‌ద్ద‌నే వ‌ద్దంటూ ఓపెన్ గా వ్యాఖ్య‌లు చేసి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. మీరు అనుభవజ్ఞులు అంటూనే.. మీరేం చేస్తే బాగుంటుందో ఆలోచించి చేయాల‌న్న విన్న‌పాన్ని ఒద్దిక‌గా చెప్పిన జేడీ.. అదే ప‌నిగా కాన్ఫ‌రెన్స్ లు నిర్వ‌హించ‌టంపై త‌న‌కున్న అసంతృప్తిని ఓపెన్ గా చెప్పేశారు.

బాబులో మంచిత‌నం ఎక్కువ అంటూనే.. దాని కార‌ణంగా జ‌రుగుతున్న న‌ష్టాన్ని విప్పి చెప్పారు. త‌ప్పు చేసినా దండించ‌క‌పోతే ఎలా?  మంత్రాల‌కు చింత‌కాయ‌లు రాల‌వ‌ని.. ఒక రాయి వేయాల్సిందేనంటూ బాబుకు సూచ‌న చేశారు. అంద‌రి కంటే ఎక్కువ‌గా తాను విమ‌ర్శిస్తూ ఉంటాన‌ని.. కానీ త‌న‌లో ఎలాంటి చెడ్డ‌బుద్ధితో తాను ఆ ప‌నిని చేయ‌న‌ని చెప్పుకున్నారు. ఇంత ఓపెన్ గా మాట్లాడిన జేసీ మాట‌ల‌కు బాబు ఎంత‌లా రియాక్ట్ అవుతారన్న‌ది రానున్న రోజుల్లో సీఎం చేత‌లు చెబుతాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News