జేసీ దివాకర్ రెడ్డి కొత్త ధీర్ఘాలు.. అంతరార్థం ఏమిటి?

Update: 2019-04-29 11:30 GMT
'జగన్ గెలిచినా.. చంద్రబాబు నాయుడు గెలిచినా..రాష్ట్రం బాగుపడాలి..' అంటున్నారు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ఈయన మాటలు కాస్త కొత్తగా వినిపిస్తున్నాయి. కొత్త దీర్ఘాలు తీస్తున్నట్టుగా ఉన్నారు  జేసీ దివాకర్ రెడ్డి. ఎన్నికల పోలింగ్ పూర్తి అయ్యి, జనాలు ఫలితాల కోసం వేచి ఉన్న తరుణంలో దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా మారాయి!

సూటిగా చెప్పాలంటే.. జగన్ గెలిచినా ఫర్వాలేదు అన్నట్టుగా  దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. పోలింగ్ పూర్తి అయిన ఏపీ ఎన్నికల్లో ఫలితాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలున్నాయన్న అంచనాల మధ్యన జేసీ దివాకర్ రెడ్డి వ్యూహాత్మకంగానే ఇలా మాట్లాడుతున్నారా.. అనే సందేహాలు కలుగుతూ ఉన్నాయిప్పుడు.

ఒకవైపేమో చంద్రబాబు నాయుడే గెలుస్తారు.. అని జేసీ అంటున్నారు. మరోవైపు 'జగన్ గెలిచినా..'అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. ఇదంతా జేసీ మార్క్ స్ట్రాటజీ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి పరిశీలకుల నుంచి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారికి దగ్గరగా ఉండేందుకే దివాకర్ రెడ్డి ఇలా మాట్లాడుతూ ఉన్నారని జేసీ అంటున్నారు. గతంలో తను జగన్ మీద చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా ఇప్పుడు  చేతులెత్తేస్తుండం మరింత విశేషం. ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ మాట్లాడుతూ.. గతంలో తను చేసిన వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడు చేతులు ఎత్తేశారు.

గతంలో జగన్ కులం విషయంలో కూడా జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని టీవీ చానల్ యాంకర్ ప్రస్తావించగా.. జేసీ ఆ మాటలను రిపీట్ చేసేందుకు ఇష్టపడలేదు. ఇప్పుడు మళ్లీ పాత డైలాగులు వేసి ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలన్నట్టుగా ఆ మాటలను స్కిప్ చేసేందుకు ఆ ఇంటర్వ్యూలో జేసీ ప్రయత్నించారు.

'చంద్రబాబు నాయుడు ఎందుకు గెలుస్తారని అనుకుంటున్నారు..' అంటే ఏవో లాజిక్కులు చెప్పారు జేసీ. అయితే జగన్ మీద మాత్రం ఎలాంటి తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. జేసీ తీరులో ఈ మార్పు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో నెగ్గితే ఈయన ఫ్యామిలీతో సహా అటు వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు ఉండనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో జేసీ వ్యాఖ్యలు ఆసక్తిదాయకంగా మారాయి.

Tags:    

Similar News