జగన్ ను నీ యబ్బా అనేశాడు

Update: 2015-12-29 11:19 GMT
రాష్ర్ట రాజ‌కీయాలు అంటే ముఖ్య‌మంత్రి - ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌ - కీల‌క‌మైన పార్టీ రాజ‌కీయ అధ్య‌క్షుడు...ఏదైనా త‌ట‌స్థ వేదిక అంటూ ఉంటే స‌ద‌రు విభాగం అధ్య‌క్షుడు ఇలాంటి కీల‌క‌మైన నాయ‌కులు మాత్ర‌మే మీడియాలో క‌నిపిస్తుంటారు. కానీ ఈ త‌ర‌హా ప్రాధాన్య పోస్టుల‌తో సంబంధం లేకుండా మీడియాలో క‌న‌ప‌డే వ్య‌క్తులు - రాజ‌కీయ నాయ‌కులు అరుదుగా ఉంటారు. అందులో ప్ర‌ముఖ స్థానంలో ఉండేది తెలుగుదేశం ఎంపీ - మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ వాది అయిన జేసీ ఆ పార్టీలో ఉన్న‌పుడు ఎంత భోళాగా త‌న‌కు న‌చ్చింది మాట్లాడేసేవారో...తెలుగుదేశంలో చేరిన త‌ర్వాత కూడా అదే ట్రెండ్‌ ను కొన‌సాగిస్తున్నారు.

తాజాగా ఆయ‌న వైసీపీ అధినేత-ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ పై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డారు. జ‌గ‌న్ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా విఫ‌ల‌మ‌య్యాడ‌ని విమ‌ర్శిస్తూ....ఆయ‌న ఎల్ల‌ప్పుడు చేసే ప‌ని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడును తిట్టడమే అని ఎద్దేవా చేశారు. త‌న‌దైన ఆలోచ‌న విధానంతో ముందుకువెళ్తున్న జ‌గ‌న్ మంచి ప‌నుల‌ను కూడా స‌హించ‌డం లేద‌ని....చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డ‌మే ప్ర‌తిప‌క్ష నేత‌గా త‌న బాధ్య‌త అని ఫీల‌వుతున్నాడ‌ని వ్యాఖ్యానించారు. నోరు తెరిస్తే ముఖ్య‌మంత్రి పీఠం గురించి జ‌పించే జ‌గ‌న్ మంచి ప‌నులు చేయ‌డం ద్వారా ఆ స్థానాన్ని పొందాల‌నుకోవాలే త‌ప్పితే విమ‌ర్శ‌ల ద్వారా సీఎం కావాల‌నుకుంటే అది సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని స‌ల‌హా ఇచ్చారు.

ఈ క్ర‌మంలో ఏపీ సీఎం చంద్ర‌బాబును జేసీ ఆకాశానికి ఎత్తేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ లోని అన్నిప్రాంతాల‌ను అభివృద్ధి చేసేందుకు చంద్ర‌బాబు పాటుప‌డుతున్నార‌ని చెప్పారు. సీమ‌ను స‌స్య‌శ్యామ‌లం చేసేందుకు చంద్ర‌బాబు క్రియాశీలంగా అడుగులు వేస్తున్నార‌ని ఈ క్ర‌మంలో త‌న బుల్లి మ‌న‌వ‌డితో కూడా ముచ్చ‌ట్లు పెట్ట‌డం లేద‌ని కీర్తించారు. అలాంటి ముఖ్య‌మంత్రి ఉన్నందుకు ప్ర‌తిప‌క్ష నేత‌గా వైఎస్ జ‌గ‌న్ సంతోప‌డాలి, త‌ప్పులు ఏమైనా చేస్తే స‌ర్దిచెప్పాలే త‌ప్ప ఊరికే విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌న్నారు.

ఇదీ జేసీ గారి తాజా వాక్కులు. రాజ‌కీయాల్లో ప్ర‌స్తుతం ఉన్న అతికొద్ది మంది సీనియ‌ర్ నాయ‌కుల్లో ఒక‌ర‌యిన జేసీ దివాక‌ర్ రెడ్డి...త‌మ పార్టీ నాయ‌కుడిని కాపాడుతూనే అదే స‌మ‌యంలో ప్ర‌తిప‌క్ష నేత‌కు హిత‌బోధ చేశారు. ఎంతైనా సీనియారిటీ నుంచి వ‌చ్చిన అనుభ‌వం మ‌రి.
Tags:    

Similar News