జేసీ...సైకిల‌్ గాలి తీసి...

Update: 2018-11-11 14:30 GMT
జె.సీ.దివాకర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో... ము‌ఖ్యంగా అనంతపురం జిల్లాలో ఓ వెలుగు వెలిగిన నాయకుడు. ఎప్పుడైతే పార్టీ మారి సైకిల్ ఎక్కారో అప్పటి నుంచి  ఆయన పరిస్థితి ఆయనకు తెలియకుండా ఉంది. అనంతపురం ఎంపీగా గెలిచినా... జిల్లా తెలుగుదేశం పార్టీలో మాత్రం ఆయనకు ప్రతి నిమిషం చుక్కెదురవుతూనే ఉంది. దీనికి తోడు ఏ చానెల్ అయినా... ఏ కార్యక్రమం అయినా మైకు కనపడితే చాలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ఆయన శైలి కూడా దివాకర్ రెడ్డికి ఇబ్బందులు కలిగిస్తోంది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలా ఉన్న నాయకులు - కార్యకర్తలపై దివాకర్ రెడ్డి విరుచుకుపడుతున్న తీరు... కొందరు ప్రజాప్రతినిధులను మార్చాలంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఫిర్యాదులు చేస్తున్న తీరు జిల్లా నాయకులకు మింగుడు పడడం లేదు.కొన్నాళ్ల పాటు ము‌ఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.... ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాటలు వినడం వంటివి చేసినా రోజురోజుకు జేసీ తీరు వివాదాస్పదమవడంతో ఆయన కూడా దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇక ముందు తాను రాజకీయాల్లో కొనసాగనని - తనకు బదులుగా తన కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి ఎంపీ టిక్కట్ ఇవ్వాలని దివాకర్ రెడ్డి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడ్ని కోరినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనకు చంద్రబాబు నాయుడు ససేమిరా అన్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కరితోనూ జేసీ దివాకర్ రెడ్డికి పొసగడం లేదని అంటున్నారు. జేసీ సోదరుల వైఖరితో స్ధానిక తెలుగుదేశం నాయకులు - ప్రజాప్రతినిధులు తీవ్రంగా విభేదిస్తున్నారు. అందరితోనూ కలగొలుపుగాను - స్నేహంగానూ ఉండే మంత్రి కాలువ శ్రీనివాసులుతో కూడా జేసీ సోదరులు - వారి అనుచరులకు పడడం లేదంటున్నారు. దీంతో చంద్రబాబు నాయుడు కూడా కొన్నాళ్లు సహించినా ఇక ముందు దివాకర్ రెడ్డి అండ్ కో ను పక్కన పెట్టాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా తన కుమారుడికి టిక్కట్ అడిగిన దివాకర్ రెడ్డికి ము‌ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరికొత్త మెలిక పెట్టినట్లు చెబుతున్నారు. అనంతపురం లోక్‌ సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి తన కుమారుడికి అనుకూలంగా ఉంటామని లేఖలు తీసుకువస్తే టిక్కట్ ఇస్తామని చెప్పినట్ల వార్తలు వస్తున్నాయి. దీంతో కంగు తిన్న దివాకర్ రెడ్డి వారెవ్వరూ అక్కడ గెలవరని, వారి నుంచి లేఖలు తీసుకురావడమేమిటంటూ ఎదురు ప్రశ్నించినట్లు చెబుతున్నారు. దీంతో జిల్లా రాజకీయాలు తనకు తెలుసునని, సమయం వచ్చినప్పుడు అన్నీ తానే చేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. దివాకర్ రెడ్డి తన వైఖరితో అటు తెలుగుదేశం పార్టీకి, ఇటు వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి చెందకుండా పోయారని అంటున్నారు.


Tags:    

Similar News