ఇదెక్కడి కన్ఫ్యూజన్? సీఎం కేసీఆర్ ను జేసీ కలిశారా? కలవలేదా?

Update: 2021-09-24 09:43 GMT
రాజకీయంగా ఆసక్తికర పరిణామం అంటే అందరి చూపులు దాని మీదే ఉంటాయి. అలాంటి విషయంలో గందరగోళం చోటు చేసుకోవటం చాలా తక్కువ సందర్భాల్లోనే చోటు చేసుకుంటుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు నుంచి షురూ కావటం తెలిసిందే. ఈ రోజు సమావేశాల హైలెట్.. ఏపీకి చెందిన టీడీపీ నేత.. మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణానికి రావటం. తొలుత ఆయన తనకు సుపరిచితమైన సీఎల్పీ ఆఫీసులో.. తన పాత మిత్రుల్ని కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాల మీద వారి మధ్య చర్చ సాగింది.

అనంతరం ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినట్లుగా కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తే.. మరికొన్ని మీడియాలో ఆయన కలవలేదన్న వార్తలు వచ్చాయి. దీంతో.. అసలు ఆయన కలిశారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సీఎం కేసీఆర్ ను జేసీ దివాకర్ రెడ్డి కలిశారని.. పలు అంశాల గురించి ఆయన మాట్లాడారని.. వ్యక్తిగత హోదాలోనే సీఎం కేసీఆర్ ను కలిసినట్లుగా ప్రముఖ మీడియా సంస్థలు కొన్ని చెబితే.. అందుకు భిన్నంగా మరికొన్ని మీడియా సంస్థల్లో మాత్రం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవాలని జేసీ అనుకున్నారని.. కానీ.. ఆయన దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే హడావుడిలో ఉన్నందున ఆయన్ను కలవటం సాధ్యం కాలేదని చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవటం కుదరని నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ను కలిశారని.. వారి కాసేపు పలు అంశాల మీద మాట్లాడినట్లుగా మీడియా రిపోర్టులు వస్తున్నాయి. దీంతో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను జేసీ కలిశారా? లేదా? అన్న దానిపై స్పష్టత రాని పరిస్థితి నెలకొంది. అందరికి ఆసక్తికరమైన రాజకీయ పరిణామానికి సంబంధించిన విషయంలో ప్రముఖ మీడియా సంస్థలు తలో దారి అన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం.


Tags:    

Similar News