బాబును జేసీ అడ్డంగా బుక్ చేసేశారు!

Update: 2018-02-19 11:37 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ఎప్పుడు చూసినా... నీతులు చెబుతూనే ఉంటారు. ఎన్నిక‌ల్లో డ‌బ్బు తీసుకుని ఓట్లు వేయ‌వ‌ద్ద‌ని, అలా చేస్తే... అభివృద్దికి పాత‌రేసిన‌ట్లేన‌ని కూడా చంద్ర‌బాబు చెబుతుంటారు. అంతేకాకుండా విప‌క్షాల‌పై నిత్యం త‌న‌దైన శైలిలో దండెత్తే చంద్ర‌బాబు... ఆయా పార్టీలు ఎన్నిక‌ల్లో విచ్చ‌ల‌విడిగా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నాయ‌ని -ఫ‌లితంగా ఎన్నిక‌లు డ‌బ్బుమ‌య‌మైపోయాయ‌ని కూడా ఆవేద‌న వ్యక్తం చేస్తున్న వైనం మ‌న‌కు కొత్తేమీ కాదు. అస‌లు ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంపిణీ బాగానే పెరిగిపోయింద‌ని ఇటీవ‌ల దాదాపుగా రాజ‌కీయ నేత‌లంతా కూడా ఒప్పేసుకుంటున్న వైనం కూడా తెలియ‌నిదేమీ కాదు. మొన్న‌టి నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెలుపు కోసం అధికార పార్టీ హోదాలో టీడీపీ... ఎన్నిక‌ల తాయిలాల‌ను బ‌హిరంగంగానే ప్ర‌క‌టించేసిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రించింది. అప్ప‌టిదాకా నంద్యాల అభివృద్దికి సింగిల్ పైసా కూడా ఇవ్వ‌ని చంద్ర‌బాబు స‌ర్కారు... స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు వేలాది కోట్ల రూపాయల‌తో నంద్యాల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఓ వైపు ఎన్నిక‌లకు సంబంధించిన ప్ర‌క‌ట‌న విడుద‌ల అయిన త‌ర్వాత కూడా చంద్ర‌బాబు నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించార‌న్న విమ‌ర్శ‌లు కూడా నాడు వినిపించాయి. అయితే త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌ను చాలా లైట్ తీసుకునే చంద్ర‌బాబు... ఇత‌ర పార్టీల నేత‌ల‌ను మాత్రం బ‌ద్నాం చేయ‌డంలో మాత్రం ముందుంటార‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు.

అయినా ఇప్పుడు చంద్ర‌బాబుకు సంబంధించి ఈ ఉపోద్ఘాతం ఎందుక‌న్న విష‌యానికి వ‌స్తే... అధికార పార్టీ ఎంపీగా - తెలుగు నేల రాజ‌కీయాల్లో సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌గా - ఉన్న విష‌యాన్నైనా మోహమాటం లేకుండా కుండ‌బ‌ద్ద‌లు కొట్టే విధంగా మాట్లాడే తత్వం క‌లిగిన నేత‌గా పేరున్న అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి... ఇప్పుడు చంద్ర‌బాబును అడ్డంగా బుక్ చేశార‌నే చెప్పాలి. ఓ న్యూస్ ఛానెల్‌ కు ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో చాలా విష‌యాల‌ను కాస్తంత బోల్డ్‌ గానే చెప్పేసిన జేసీ... చంద్రబాబును మాత్రం నిజంగానే అడ్డంగా బుక్ చేశారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు డ‌బ్బు మ‌య‌మైపోయింద‌ని ఆవేద‌న వ్యక్తం చేసిన జేసీ... ఎన్నిక‌ల్లో తాము కూడా డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని ఒప్పేసుకున్నారు. ఇవాళ ఎల‌క్ష‌న్లు ఎంత కాస్ట్‌ లీగా మారిపోయాయ‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించిన జేసీ... ఇప్పుడు డ‌బ్బు తీసుకోకుండా ఓటేసే వారే కనిపించ‌డం లేద‌ని తేల్చేశారు. డ‌బ్బివ్వ‌క‌పోతే ఎవ‌డ‌న్నా ఓటేసేవాడున్నాడా? అంటూ త‌న‌దైన శైలిలో ప్ర‌శ్నించిన జేసీ... అన్ని అంశాల‌పై ఏమాత్రం గోప్య‌త లేకుండా ఫ్రాంక్‌ గా మాట్లాడుకుందామంటూ వ్యాఖ్యానించారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు టీవీ ఛానెల్ ప్ర‌తినిధి  మొన్న‌టి ఎన్నిక‌ల్లో మీరెంత ఖ‌ర్చు పెట్టార‌ని ప్ర‌శ్నించారు. ఈ ప్ర‌శ్నకు కాస్తంత బోల్డ్‌ గానే స్పందించిన జేసీ... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో చాలా డ‌బ్బే ఖ‌ర్చు చేశాన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు.

ఎన్ని  కోట్లు ఖ‌ర్చు పెట్టాన‌న్న విష‌యాన్ని చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌ని జేసీ... బాగానే ఖర్చు చేయాల్సి వ‌చ్చింద‌ని, ఖ‌ర్చు బాగానే త‌గిలింద‌ని వ్యాఖ్యానించారు. అదే ఫ్లోను కొన‌సాగించిన జేసీ... చంద్ర‌బాబే కాదు... న‌రేంద్ర మోదీ అయినా డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌నిది ప‌ని అయ్యే ప్ర‌సక్తే లేదు అని అన్నారు. అయితే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది ఎందుకంటూ ఆ ఛానెల్ ప్ర‌తినిధి సంధించిన ప్ర‌శ్న‌కు స‌మాధానంగా జేసీ మ‌రో సంచ‌ల‌న వ్యాఖ్య కూడా చేశారు. ఎన్నిక‌ల్లో కోట్ల‌కు కోట్ల మేర డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టేసి... వాటిని ఆ  త‌ర్వాత రీయింబ‌ర్స్ చేసుకోక‌పోతే ఎలాగంటూ త‌న‌దైన కొత్త వాద‌న‌ను వినిపించారు. వెర‌సి ఎన్నిక‌ల్లో ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బును ఎన్నిక‌ల త‌ర్వాత వివిధ మార్గాల్లో సంపాదించుకోవ‌డం కూడా స‌ర్వ‌సాధార‌ణంగా జ‌రిగిపోతోంద‌ని జేసీ చెప్పుకొచ్చారు. అలా రీయింబ‌ర్స్ చేసుకోక‌పోతే.... రాజ‌కీయ నాయ‌కుల‌కు చిప్పే గ‌తి అన్న కోణంలోనే ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మొత్తంగా ఎన్నిక‌ల్లో రాజకీయ నాయ‌కులు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్ట‌డం స‌హ‌జ‌మేన‌ని, అదే స‌మ‌యంలో ఆ ఖ‌ర్చు పెట్టిన డ‌బ్బును తిరిగి సంపాదించుకునేందుకు పొలిటీషియ‌న్లు అడ్డ దారులు తొక్కుతున్న వైనంలో ఎలాంటి త‌ప్పులేద‌న్న రీతిగా జేసీ నిజంగానే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News