జేసీ మాట‌!... ఎంపీగా ఫెయిల‌య్యా!

Update: 2017-11-28 07:04 GMT
ఆయ‌న ఏం మాట్లాడినా సంచ‌ల‌న‌మే. ప్ర‌స్తుతం అధికార పార్టీలో ఉన్నా ప్ర‌తిప‌క్ష‌పాత్ర పోషిస్తున్న‌ట్టుగానే ఆయ‌న వ్యాఖ్య‌లు ఉంటాయి. విష‌య‌మేదైనా న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడ‌టం ఆయ‌న నైజం. 40ఏళ్లుగా రాజ‌కీయాల్లో కొన‌సాగుతున్న ఆయ‌న తాను రాజ‌కీయాల‌కు ప‌నికిరాన‌ని చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఎంపీగా ప‌నిచేస్తున్న తాను ఆ ప‌ద‌వికి అన‌ర్హుడిన‌ని వ్యాఖ్యానించ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ దివాకర్ రెడ్డిది వినూత్న వైఖ‌రి. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎంపీగా కొనసాగుతున్న ఆయన ఇటీవ‌ల‌ ఛానల్‌ కు ఇచ్చిన ఇంటర్య్యూలో చేసిన‌ వ్యాఖ్యలతో వార్త‌ల్లోకెక్కారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు చేశారు. తనకు - తన సోదరుడు (జేసీ ప్రభాకర్ రెడ్డి)కి మంత్రి పదవులు ఇచ్చే అవ‌కాశం లేదని కుండ‌బద్ద‌లు కొట్టేశారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో తమ అన్నదమ్ములను ఎన్నికల్లో పోటీ చేయవద్దని చంద్రబాబు అంటారేమోనన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. తాము కూర‌లో క‌రివేపాకులా మారిపోయామ‌ని.. త‌మ‌ను వాడుకుని వ‌దిలేసే ఉద్దేశంలో ఉన్నార‌ని ఆరోపించారు.

ప్రస్తుతం రాజకీయాలు కలుషితం అయ్యాయని - ఏడుసార్లు ఎన్నికల్లో గెలిచిన తాను ప్రస్తుత పరిస్థితి చూసి ఇక రాజ‌కీయాల నుంచి త‌ప్పుకోవాల‌నుకుంటున్నాన‌ని జేసీ వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న‌ అందరూ అవినీతి పరులేనన్న ఆయ‌న‌ తాను మాత్రం అవినీతికి దూరమని చెప్పారు. రాజకీయ నాయకుడిగా కమిషన్లకు ఎన్నడూ తాను కక్కుర్తి పడలేదని స్పష్టం చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు తానెప్పుడూ పాల్ప‌డ‌లేద‌ని చెప్పారు. అభివృద్ధికి దూరంగా ఉన్న అనంతపురం పార్ల‌మెంటు నియోజకవర్గాన్ని ముందుకు నడిపించడంలో ఎంపీగా తాను విఫలం అయ్యానని జేసీ దివాకర్ రెడ్డి అంగీక‌రించ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది. ఈ పరిస్థితుల్లో తాను ఎంపీగా కొనసాగడం భావ్యమా? అని సందేహం కలుగుతోందని అన్నారు. తన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని అన్నారు.
Tags:    

Similar News