తాడిప‌త్రి మే స‌వాల్‌.. న‌డిరోడ్డు మీద చూసుకుందాం.. రా!

Update: 2021-07-29 13:30 GMT
అనంత‌పురం జిల్లా తాడిప‌త్రిలో అధికార‌, విప‌క్ష నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత విష‌యంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మునిసిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి మ‌ధ్య కొన‌సాగుతున్న వివాదం.. ఇంకా చ‌ల్లార‌లేదు. రాజ‌కీయాల్లో ఎప్ప‌టి నుంచో ప్ర‌త్య‌ర్థులుగా ఉన్న వీరిద్ద‌రూ.. మ‌రోసారి మాట‌ల తూటాలు పేల్చుతూ అగ్గి రాజేశారు.

తాడిప‌త్రిలోని మునిసిప‌ల్ స్థ‌లంలో అక్ర‌మంగా ఇళ్ల నిర్మాణం చేప‌ట్టార‌ని, వాటిని కూల్చేందు కోసం చ‌ర్య‌లు చేప‌ట్టారు అధికారులు. ఈ విష‌యంలోనే ఇద్ద‌రు నేత‌ల మధ్య వివాదం మొద‌లైంది. ఆ మునిసిపాలిటీని టీడీపీ గెలుచుకున్న సంగ‌తి తెలిసిందే. మునిసిప‌ల్ చైర్మ‌న్ గా ఉన్న జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డికి సీపీఐ కౌన్సిల‌ర్ మ‌ద్ద‌తు ఇచ్చార‌ని, ఈ కార‌ణంగానే క‌క్ష‌గ‌ట్టి వారి నివాసాన్ని కూడా కూల‌దోసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంద‌ని జేసీ ఆరోపించారు. దీనికి ప్ర‌తిగా పెద్దారెడ్డి కౌంట‌ర్ వేయ‌డంతో.. నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది.

''గడిచిన 30 ఏళ్లుగా వారంతా ఇక్క‌డ ఇళ్లు నిర్మించుకొని ఉంటున్నారు. నీకు కౌన్సిలర్ కావాలంటే చెప్పు నేనే.. మీ పార్టీలోకి పంపిస్తా. అంతేకానీ ఇలా వేధించొద్దు'' అన్నారు జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి. అంతేకాకుండా.. ఇళ్ల‌ను కూల్చివేసేందుకు య‌త్నిస్తే మాత్రం చూస్తూ ఊరుకోబోమ‌ని హెచ్చ‌రించారు. త‌న‌ను మునిసిప‌ల్ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి దించేయాల‌ని చూస్తున్నార‌ని, అయినా.. ఇంకా మూడున్న‌రేళ్లు తాను ప‌ద‌విలో కొన‌సాగుతాన‌ని అన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్పందించారు. జేసీకి ద‌మ్ముంటే.. అత‌ను మ‌గాడైతే.. తాడిప‌త్రిలో 30 ఏళ్లు రాజ‌కీయం చేసిన వ్య‌క్తి అయితే.. మునిసిప‌ల్ స్థ‌లాల‌ను ఆక్ర‌మించుకున్న వారి పేర్ల‌ను క‌మిష‌న‌ర్ కు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. తాను కూడా అక్ర‌మంగా కాంప్లెక్సులు నిర్మించుకున్న‌వారి పేర్లు ఇస్తాన‌న్నారు. ద‌ళితు భూముల‌ను ఆక్ర‌మించారని, చివ‌ర‌కు సైడు కాల్వ‌ల‌ను కూడా వ‌ద‌ల్లేద‌ని అన్నారు. ఈ విధంగా ఇరువురు నేత‌లు బాహాబాహీకి దిగిన‌ట్టుగా మాట‌ల తూటాలు పేలుస్తుండ‌డంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.
Tags:    

Similar News