జేడీ రాటుదేలి జేపీలా... ఎన్నికల సంస్కరణల కోసం పోరాటం

Update: 2022-11-22 10:30 GMT
ఈ దేశంలో మేధావులకు తక్కువ లేదు. లెక్కలు అందరికీ వచ్చు. ఒక నాయకుడి ఎన్నికను నిర్ణయించాల్సింది మొత్తం పోలిన ఓట్లలో యాభై శాతం పైగా ఆయన తెచ్చుకుంటేనే అని అందరికీ తెలుసు. కానీ ఇంత చిన్న లెక్క కూడా రాజకీయాల్లో తప్పుతుంది. అది రాంగ్ అవుతుంది. కారణం ట్రెడిషనల్ పాలిటిక్స్.

ఆ మాటకు వస్తే ఇతర దేశాలలో అమలవుతున్న ఎన్నికల సంస్కరణలు కూడా దేశంలో అమలు కావడంలేదు. ఎందుకంటే చట్టాలు చేసే వారంతా రాజకీయ నాయకులు కావడంతో వారు తమకు అనుకూలంగా వాటిని మలచుకుంటున్నారు అన్న భావన అయితే అందరిలో ఉంది.

దీని మీదనే చాలా ఏళ్ల క్రితం ఎన్నికల సంస్కరణలు అంటూ మాజీ బ్యూరోక్రాట్ జయప్రకాష్ నారాయణ్ చాలా పెద్ద ఎత్తున ఉద్యమించారు. లోక్ సత్తా పేరిట ఆయన జనంలోకి వెళ్ళి చైతన్యం తెచ్చే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన పోరాటాల ఫలితంగా నోటా అన్న ఆప్షన్ కూడా వచ్చిందని అంటారు. అలాగే జాతీయ ఉపాధి హామీ పధకం కామీ సమాచార చట్టం కానీ రావడానికి జేపీ కృషి ఎంతో ఉందని అంటారు.

ఆయన గత యూపీయే సర్కార్ హయాంలో సోనియా గాంధీతో కలసి జాతీయ సలహామండలిలో పనిచేశారు. అలాంటి జేపీ జనంలో నిలిచి మార్పు తీసుకువద్దామంటే అసలు కుదరలేదు. ఆయన కూడా ఒకసారి మాత్రమే ఎమ్మెల్యే అయ్యారు. సంప్రదాయ రాజకీయంతోనే జనాలు సర్దుకుపోతున్నారు.

ఇక ఆయన ప్లేస్ లో ఇపుడు మరో మాజీ బ్యూరోక్రాట్ జేడీ లక్ష్మీనారాయణ వచ్చారు. ఆయన జగన్ కేసుల మీద విచారణ అధికారిగా సీబీఐలో ఉండడం ద్వారా జనంలో పాపులారిటీ సంపాదించారు. ఆ తరువాత ఆయన తన ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనమా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా జనసేన తరఫున పోటీ చేసి ఓడిపోయారు.

ఈ మధ్యనే జేడీ మళ్లీ తన యాక్టివిటీని పెంచారు. ఆయన తాజాగా ఎన్నికల సంస్కరణల మీద తన గళం వినిపిస్తున్నారు. దేశంలో ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని జేడీ బలంగా చెబుతున్నారు. ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మధ్యలో రాజీనామా చేస్తే ఉప ఎన్నిక రాకుండా ఆయనతో పోటీ పడి తరువాత ఎక్కువ ఓట్లు తెచ్చుకున్న వారిని ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా నియమించేలా ఎన్నికల సంస్కరణలు రావాలని  జేడీ ప్రతిపాదించారు.

అదే విధంగా ఎన్నికల సంఘంలో ఉన్న  ముగ్గురు కమిషనర్లు మరింత పారదర్శకంగా పనిచేసేలా ఉండాలంటే ప్రధానమంత్రి,  ప్రతిపక్ష నేత, సీజేఐతో కూడిన కమిటీ ఈసీలను ఎంపిక చేయాలని సూచించారు. ఇక వారు పదవీ విరమణ తర్వాత లాభదాయకమైన పదవుల్లో ఉద్యోగం చేయడం కోసం వారు శాశ్వతంగా నిషేధించబడేలా చూడాలని కోరారు.

అలాగే, దేశాన్ని ఏలే ప్రధానులు ముఖ్యమంత్రులు మొత్తం ప్రజలకు బాధ్యత వహిస్తారు కాబట్టి వారిని ఎన్నికల ప్రచారం నుంచి మినహాయించాలని కోరారు. అలాగే,  కార్యనిర్వాహక పదవులు లేదా పార్టీ పదవులు నిర్వహించాలా అనేది వారు నిర్ణయించుకోవాలన్నారు. అదే విధంగా రాష్ట్రాలలో  రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా అదే రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిని నియమించకుండా ఇతర రాష్ట్ర కేడర్ నుండి నియమించేలా సంస్కరణలు తేవాలని కోరారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లో పేర్కొన్న నేరాలకు సంబంధించి కోర్టు ద్వారా క్రిమినల్ అభియోగాలు మోపబడిన వారిని విచారణలో కేసు పరిష్కారమయ్యే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలన్నారు. ఆ విధంగా చేస్తే కనుక కచ్చితంగా మార్పు రావడమే కాకుండా ఎన్నికలు మరింత నిష్పాక్షింగా జరుగుతాయని జేడీ ఆశిస్తున్నారు. దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని తాను సుప్రీం కోర్టులో దాఖలు చేయనున్నట్లుగా ఆయన చెబుతున్నారు.

మొత్తానికి ఎన్నికలలో పోటీ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన జేడీ ఇపుడు సంస్కరణలు అంటూ కొత్త వాదాన్ని ఎంచుకున్నారు. దాంతో ఆయన రాటుదేలి  మరో జేపీ అయ్యారని అంతా అంటున్నారు. మరి ఈ పోరాటంలో ఆయన విజయవంతం ఎంతవరకూ అవుతారో చూడాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News