విశాఖ ఎంపీ సీటుకు  ఇండిపెండెంట్ గా జేడీ రెడీ

Update: 2022-12-24 09:54 GMT
సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఇంతకాలం ఆయన తాను ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తారు అని ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. జేడీ కూడా వీలైతే తనకు నచ్చిన పార్టీ నుంచి పోటీకి దిగుతాను అని చెప్పేవారు. లేకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీలో ఉంటాను అని కూడా అన్నారు.

కానీ ఇపుడు ఆయన ఇండిపెండెంట్ గానే రంగంలోకి అంటూ సంచలన నిర్ణయాన్ని ప్రకటించేశారు. ఈ విషయాన్ని జేడీ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ జగన్ మురారి తెలిపారు. అంటే జేడీ నుంచి వచ్చిన మ్యాటరే అనుకోవాలి. మరి జేడీ ఎందుకు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి పోటీకి దిగడం లేదు అన్నది ఒక చర్చగా ఉంది. ఆయనకు అన్ని పార్టీలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి.

ఆయన కోరుకోవాలే కానీ తెలుగుదేశం, బీజేపీ జనసేన కూడా ఇన్వైట్ చేస్తాయి. జేడీ 2019 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి రెండు లక్షల 80 వేల పై చిలుకు ఓట్లు సాధించారు. అందువల్ల మరోసారి జనసేన నుంచి పోటీ చేస్తే కచ్చితంగా ఎంపీ అవుతారు అని అంటున్నారు. అయితే జేడీ జనసేనను వీడి బయటకు వచ్చేశారు. అదే సమయంలో ఆయన తనంతట తాను వెళ్ళి కలిస్తే కచ్చితంగా పవన్ తీసుకుంటారు అని అంటున్నారు.

మరి జేడీ ఎందుకో జనసేన వైపు మొగ్గు చూపడంలేదు అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ సైతం జేడీ అంటే మొదటి నుంచి ప్రత్యేక అభిమానాన్ని చూపిస్తూ వస్తుంది. జగన్ అక్రమాస్తుల కేసులను ఆయనే డీల్ చేశారు. అందువల్ల జేడీని తమ వైపునకు తిప్పుకుంటే జగన్ మీద మరింత దూకుడుగా రాజకీయ పోరాటం చేయడానికి వీలు దొరుకుతుంది అన్నది టీడీపీ ఆలోచన.

ఇక బీజేపీని తీసుకుంటే ఆ పార్టీకి జేడీ లాంటి బిగ్ ఫిగర్ మేధావి అవసరం ఉంది. విశాఖలో బీజేపీకి కొంత ఓటు బ్యాంక్ ఉంది దాన్ని పెంచుకుంటూ జేడీని బరిలోకి దించితే విజయావకాశాలు ఉంటాయని అంటున్నారు. అయితే ఇక్కడ కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. టీడీపీ బీజేపీ జనసేన కలిస్తే  విశాఖ ఎంపీ సీటు బీజేపీ తీసుకోవచ్చు అని అంటున్నారు. అపుడు ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పోటీ చేస్తారు అని చెబుతున్నారు.

ఒకవేళ అలా కాకుండా బీజేపీ జనసేన కలసి పోటీ చేసినా జీవీఎల్ మాత్రం అభ్యర్థిగా  మారరు అంటున్నరు. తెలుగుదేశం తీసుకుంటే బాలయ్య అల్లుడు శ్రీ భరత్ ఉన్నారు. అలాగే ఈసారి బీసీలకు ఎంపీ టికెట్ ఇవ్వాలన్న ఆలోచన ఉంది అని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కానీ జేడీ మాత్రం ఏ రాజకీయ పార్టీతోనూ టచ్ లో లేకుండా తానుగా జనంలో ఉంటూ పోటీ చేసి గెలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. సో జేడీ ఇండిపెండెంట్ గా పోటీకి దిగడం ఖాయమన్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News