`ఫేక్ న్యూస్` ప్ర‌క‌ట‌నతో కేంద్రం సెల్ఫ్ గోల్!

Update: 2018-04-03 08:21 GMT
జ‌ర్న‌లిస్టులు - ప‌త్రిక‌లు - మీడియా చానెళ్ల‌కు సంబంధించి మ‌లేషియా ప్ర‌భుత్వం షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది. న‌కిలీ వార్తలు ప్రచురించినా - ప్ర‌సారం చేసినా.....స‌ద‌రు విలేక‌రుల‌కు గరిష్ఠంగా 6 సంవ‌త్స‌రాల జైలు శిక్ష విధించేలా నూతన చట్టాన్ని రూపొందించింది. ఆ చ‌ట్టాన్ని మలేసియా పార్లమెంటు దిగువసభ సోమవారం ఆమోదించింది. ఈ నేప‌థ్యంలో మ‌లేషియా ప్ర‌భుత్వం నుంచి మోదీ స‌ర్కార్ స్ఫూర్తి పొందిందేమో తెలియ‌దుగానీ....జ‌ర్న‌లిస్టుల‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం సోమ‌వారం నాడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప‌త్రికా స్వేచ్ఛ‌కు తూట్లు పొడిచేలా నియంతృత్వ ధోర‌ణిలో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నకిలీ వార్తలు పుట్టించినా - ప్రచారం చేసినా - ప్ర‌సారం చేసినా.....సంబంధిత విలేకరి గుర్తింపు (అక్రిడిటేషన్‌)ను శాశ్వతంగా రద్దు చేస్తామ‌ని కేంద్రం షాకింగ్ నిర్ణ‌యం తీసుకుంది.

అంతేకాదు, తాజా మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జ‌ర్న‌లిస్టులంద‌రూ త‌ప్ప‌క పాటించాల‌ని - లేకుంటే అక్రిడేష‌న్ కార్డుల‌ను నిలిపివేస్తామ‌ని హెచ్చ‌రించింది. నకిలీ వార్తల‌ని నిర్ధార‌ణ అయితే....ముందుగా సంబంధిత విలేకరి గుర్తింపును 6 నెలల పాటు రద్దు చేస్తారు. ఒక‌వేళ ఆ విలేక‌రి రెండో సారి కూడా  అదే పని చేస్తే ఏడాదిపాటు అక్రిడేష‌న్ రద్దు చేస్తారు. ఒక‌వేళ‌ మూడోసారి తప్పు చేస్తే శాశ్వతంగా అక్రిడేష‌న్ రద్దు చేస్తారు. ఈ ప్ర‌కారం సమాచార - ప్రసార మంత్రిత్వశాఖ సోమ‌వారం ఒక ప్రకటన విడుద‌ల చేసింది. నకిలీ వార్తలపై ఫిర్యాదులను సంద‌ర్భాన్ని బ‌ట్టి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)  - న్యూస్‌ బ్రాడ్‌ కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ బీఏ) పరిశీలనకు పంపుతామ‌ని తెలిపింది. 15 రోజుల్లోగా ఫిర్యాదుల‌పై ఆ సంస్థ‌లు నిర్ణయాన్ని వెల్ల‌డిస్తాయ‌ని, అప్ప‌టివ‌ర‌కు ఆ విలేకరి గుర్తింపును నిలిపివేస్తామని తెలిపింది. ఈ నిర్ణ‌యం జ‌ర్న‌లిస్టుల‌ను షాక్ కు గురిచేసింది. దీంతో, కేంద్రం నిర్ణ‌యంపై చ‌ర్చించేందుకు ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (పీసీఐ)  - న్యూస్‌ బ్రాడ్‌కాస్టర్స్‌ అసోసియేషన్‌ (ఎన్‌ బీఏ)లు నేడు అత్య‌వ‌స‌రంగా స‌మావేశం కానున్నాయి.

అయితే, కేంద్రం చేసిన ప్ర‌క‌ట‌న‌లోనే డొల్ల‌త‌నం ఉంద‌ని ప‌లువురు జ‌ర్న‌లిస్టులు మండిప‌డుతున్నారు. అస‌లు న‌కిలీ వార్త‌కు నిర్వ‌చ‌నం ఏమిటనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌! ఒక వేళ ఫ‌లానా వార్త న‌కిలీద‌ని నిర్వ‌చించి....గుర్తించే వ్య‌క్తి ఎవ‌రు? ఇటువంటి ప్ర‌శ్న‌ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం త‌ప్ప‌క స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఒక వేళ తాజా మార్గద‌ర్శ‌కాల‌ను జ‌ర్నలిస్టులు తూ.చ త‌ప్ప‌కుండా పాటిస్తే....కాస్తో కూస్తో బ్ర‌తికున్న పత్రికా స్వేచ్ఛ పూర్తిగా స‌మాధి అవుతుంద‌నడంలో ఎటువంటి సందేహం లేదు. తాజా నిర్ణ‌యం ప‌త్రికా స్వేచ్ఛ‌ను మ‌రింత హరించేదిగా ఉంది. కొత్త నియ‌మాల ప్ర‌కారం.....ప్ర‌భుత్వానికి న‌చ్చ‌ని వార్త‌ల‌న్నీ న‌కిలీ వార్తలే! అంతేకాకుండా, స‌ర్కార్ కు వ్య‌తిరేకంగా ఉండే నిప్పులాంటి నిజాల‌న్నీ త‌ప్పుడు వార్త‌లే! ఇప్ప‌టికే ఆయా ప్ర‌భుత్వాల‌కు కొద్దో గొప్పో వ్య‌తిరేకంగా వార్త‌లు రాసే వారిని, సంస్థ‌ల‌ను ముప్పుతిప్ప‌లు పెడుతున్నారు. అటువంటిది, తాజా నిబంధ‌న‌లు పాటిస్తే....ప్ర‌భుత్వం రాయ‌మ‌న్న‌దే `అస‌లు సిస‌లు`వార్త అవుతుంది! అటువంట‌పుడు ప‌త్రిక‌లు - టీవీ చానెళ్లు - జ‌ర్న‌లిస్టుల మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌క‌మ‌వుతుంది. ఇటువంటి స్వ‌యంకృతాప‌రాధాల‌తో కేంద్ర ప్ర‌భుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంటోంద‌ని ప‌లువురు నెటిజ‌న్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇటువంటి మార్గ‌ద‌ర్శ‌కాల‌కు బ‌దులు....కేంద్ర ప్ర‌భుత్వ‌మే సొంత‌గా మీడియా సంస్థ‌ల‌ను న‌డుపుకుంటే న‌కిలీ వార్త‌ల బెడ‌దే ఉండ‌ద‌ని సెటైర్లు వేస్తున్నారు.


Tags:    

Similar News