జస్ట్ స్వీట్ వార్నింగే... జగన్ మనసు తెలిపిన సజ్జల

Update: 2022-09-30 11:38 GMT
ఏపీ సీఎం జగన్ గడప గడపకు కార్యక్రమం పేరిట నిర్వహిస్తున్న వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు అన్నది బయట బాగా ప్రచారం అయిపోతోంది. మీకు టికెట్లు ఇవ్వను, ఎక్కడికక్కడ  టిక్కు పెట్టేస్తాను అంటూ జగన్ ఫైర్ అవుతున్నారు అంటూ వార్తా కధనాలు వెల్లువలా వచ్చేస్తున్నాయి. నిజానికి ఇప్పటికి మూడు నాలుగు సార్లు జగన్ వర్క్ షాప్ నిర్వహించారు. మొదటి నుంచి వర్క్ షాప్ అంటే జగన్ హెచ్చరికలు జారీ చేస్తారు అనే మీడియాలో వార్తలుగా వస్తున్నాయి.

అయితే ఇన్నాళ్ళూ దీని మీద పెద్దగా పట్టించుకోని వైసీపీ అధినాయకత్వం తాజాగా మాత్రం ఎందుకో రియాక్ట్ అయింది. జనంలోనూ పార్టీ జనంలోనూ తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతున్నాయని ఎట్టకేలకు గ్రహించినట్లుగా ఉందేమో తెలియదు కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి అబ్బే వర్క్ షాప్ లో జగన్ వార్నింగులు ఎందుకు ఇస్తారు, జస్ట్ పార్టీ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవడమే అక్కడ జరిగింది అంటూ  చెప్పారు.

అంతే కాదు గడప గడపకు కార్యక్రమం బహు చక్కగా సాగుతోందని, ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ కూడా దక్కుతోందని ఆయన పేర్కొన్నారు. మూడున్నరేళ్ళుగా ప్రభుత్వం చేసిన పని మీద ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికే గడప గడపకు కార్యక్రమం అని ఆయన వివరించారు.

ఇక జగన్ వర్క్ షాప్ లో తన పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడిన దాన్ని కూడా తప్పుగా చూసి వక్రీకరించి టీడీపీ విమర్శలు చేస్తోందని దాన్నే ప్రచారం చేస్తోందని సజ్జల మండిపడ్డారు. అందరూ ఒక ఫ్యామిలీగా కలసి పనిచేయాలనే జగన్ కోరుతూ వస్తున్నారని, ప్రభుత్వ పధకాలు కూడా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేలకు వార్నింగులు అంటూ ఎల్లో మీడియా కూడా వార్తలు రాయడమేంటి అని సజ్జల గుస్సా అవుతున్నారు. తమ పార్టీ వర్క్ షాపులో వార్నింగులు ఉండవని, అంతా స్వీట్ స్వీట్ గా సాగిపోయిన వర్క్ షాప్ ని పట్టుకుని తప్పుడు ప్రచారం చేసే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News