ఎట్టకేలకు కేకే పెదవి విప్పారు..కేసీఆర్ కు చేసిన సూచనేంటి?

Update: 2019-10-14 10:19 GMT
కె.కేశవరావు అలియాస్ కేకేగా సుపరిచితుడైన ఆయన గురించి అందరూ ఆసక్తిగా మాట్లాడతారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతగా సుపరిచితుడైన ఆయన..కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియాలో ప్రముఖంగా కనిపించేవారు. ఏ ముహుర్తంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరారో కానీ.. అప్పటి నుంచి ఆయన తీరు మొత్తం మారిపోయింది.

నోట్లో నాలుక లేనట్లుగా మారిపోయిన ఆయన.. తానేం చెప్పాలనుకున్నా అధినేత కేసీఆర్ కు నాలుగు గోడల మీద చెప్పటమే కాదు.. బయట ఒక్క మాట కూడా మాట్లాడని పరిస్థితి. ఇక.. మీడియాతోనూ ఆయన మాట్లాడటం తగ్గించేశారు. తానేం మాట్లాడిన ఏదీ ఆన్ రికార్డు కాదని స్పష్టం చెప్పే ఆయన మామూలు విషయాల్ని కూడా సీక్రెట్లు అన్నట్లుగా చెప్పటం షురూచేశారు.

అలాంటి కేకే.. చాలా కాలం తర్వాత పెదవి విప్పారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. ఆయన తన మౌనాన్ని వీడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు సలహా ఇచ్చినట్లుగా సలహాను ఇచ్చేసిన ఆయన.. తమ బాస్ తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని తెగ పొగిడేయటం గమనార్హం.  

ఆర్టీసీ కార్మికులు చేసుకున్న ఆత్మహత్యలు తనను చాలా బాధించాయని.. ఆత్మహత్య ఏ సమస్యకు పరిష్కారం కాదన్న ఆయన.. పరిస్థితి చేజారక ముందే ఆర్టీసీ యూనియన్ నేతలతో సమ్మె విరమింపచేసి చర్చలు జరపాలని కోరారు.

గతంలోనూ ఆర్టీసీ కార్మికుల సమస్యల్ని ప్రభుత్వం గోప్యంగానే పరిష్కరించిందని.. ఇప్పుడుఅదే పని చేయాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ఓపక్క సమ్మె ఆగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలన్న సూచన చేస్తూనే.. మరోవైపు సారుకు కోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం గమనార్హం. ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలన్న కార్మికుల ప్రధానమైన కోర్కె విషయంలో మాత్రం కేసీఆర్ కు చికాకు తెప్పించని రీతిలో తెలివిగా పక్కన పెట్టేశారు. ఎన్నికల ప్రణాళికలో కానీ హామీల్లో కాని.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని చెప్పలేదని గుర్తు చేశారు.

ఈ నిర్ణయం తీసుకోవటమంటే ప్రభుత్వం తన విధానాన్నిమార్చుకోవటమే అవుతుందని.. ఇది కుదరదన్నారు. ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పటం అభినందనీయంగా ఆయన అభివర్ణించారు. ఓపక్కకార్మికుల కష్టాన్ని ప్రస్తావిస్తూనే.. వారి కోరికలో సాధ్యాసాధ్యాల్ని చెప్పటం ద్వారా.. నిరసనల్ని బంద్ చేయించాలన్న తపన తనలో ఎంత ఉందన్న విషయాన్ని కేకే చెప్పినట్లుగా చెప్పాలి. మరి.. మిత్రుడు కేకే చేసిన సూచనను కేసీఆర్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


Tags:    

Similar News