టీడీపీ-బీజేపీ ట్విన్స్ అంటున్న ఆ నేత

Update: 2016-07-28 07:59 GMT
మోసం చేయడంలో తెలుగుదేశం పార్టీ-భారతీయ జనతా పార్టీ కవల సోదరుల మాదిరి ప్రవర్తిస్తున్నాయని అంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత.. మాజీ మంత్రి కె.పార్థసారథి. ఈ రెండు పార్టీలకు ప్రత్యేక హోదా విషయంలో ఏమాత్రం నిబద్ధత లేదని.. రెండు పార్టీలూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

బిల్లుకు మద్దతివ్వకుండా భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు గుప్పించడం కంటితుడుపు చర్యగా ఆయన అభివర్ణించారు. టీడీపీ.. బీజేపీ రెండూ కూడా దగాకోరు పార్టీలే అని ఆయన విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఎంతో నిబద్ధతతో ఉందని.. సాంకేతిక కారణాలతో ప్రైవేటు బిల్లును తిరస్కరించాక.. టీడీపీ ప్రత్యేకంగా బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతుండటం.. ఈ వ్యవహారాన్ని సాగదీయడమే అని ఆయన అన్నారు.

రాష్ట్ర పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టిన సమయంలో స్వయంగా ప్రధాన మంత్రే ప్రత్యేక హోదా గురించి హామీ ఇచ్చారని.. అలాంటపుడు ఇప్పుడు బిల్లుపెట్టడం.. చర్చ చేపట్టడం అనవసరమని.. నేరుగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందని పార్థసారథి అన్నారు. అప్పుడు బేజీపే పదేళ్లు.. టీడీపీ 15 ఏళ్లు ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేశాయని.. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నాయని ఆయన అన్నారు.
Tags:    

Similar News