మునుగోడుకు కిత‌కిత‌లు.. 'పాల్' అదిరిపోయే లేటెస్ట్‌ పంచ్‌ ఇదే!!

Update: 2022-10-22 15:18 GMT
ప్ర‌జాశాంతి పార్టీ అద్య‌క్షుడు, శాంతి దూత‌గా చెప్పుకొనే కేఏ పాల్ పంచ్‌లతో మునుగోడు ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. పాల్ వ‌స్తున్నారంటే.. జ‌నాలు ప‌రిగెట్టుకుంటూ వ‌స్తున్నారట‌.. ఆయ‌న‌ను చూసేందుకు, ఆయ‌న మాట‌లు వినేందుకుకాదు.. ఆయ‌న వేసే పంచ్‌ల‌కు పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వుకునేందుకేన‌ట‌!! మునుగోడును అమెరికా చేస్తానంటూ.. పేల్చిన పంచ్‌.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను ఇంకా న‌వ్విస్తూనే ఉంది. ఇది చాల‌ద‌న్న‌ట్టు.. తాజాగా మ‌రో పంచ్‌తో కిత‌కిత‌లు పెట్టారు.. పాల్‌!!

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.. మునుగోడు నియోజకవర్గం చండూరులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఓ అధికారితో వాగ్వాదానికి దిగారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్‌రాజ్ తన ఫాలోవర్ అంటూ.. విధుల్లో ఉన్న ఓ అధికారిపై తన ప్రతాపం చూపారు. ``బీకేర్ఫుల్.. తెలంగాణకు కాబోయే సీఎం నేనే`` అంటూ హెచ్చరించారు. దీంతో అక్క‌డ గుమిగూడిన జ‌నాలకు కిత‌కిత‌లే కిత‌కిత‌లు.. ఇంకేముంది.. పొట్ట‌చెక్క‌ల‌య్యేలా న‌వ్వేసుకున్నారు.  

కేఏ పాల్కు చెందిన రెండు ప్రచార వాహనాల్లో చండూరులో ప్రచారం నిర్వహిస్తున్నారు. వాటి వెనకాలే వస్తున్న కేఏ పాల్ను అధికారులు అడ్డుకున్నారు. దీంతో కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రిని అని.. తనకు మర్యాద ఇవ్వండి అంటూ మండిపడ్డారు. దీంతో అధికారులు అవాక్క‌య్యారు. ``ఏం చేస్తాం.. ఖ‌ర్మ‌`` అనుకున్నారో .. ఏమో.. వ‌దిలేసి వారి మానాన వారు వెళ్లిపోయారు.

అనంతరం నల్గొండ జిల్లా చండూరు మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేఏ పాల్ మాట్లాడారు. 1,200 మంది అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయకుండా తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్లకిస్తామన్న మూడెకరాల భూమి, ఇల్లు ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందని  పాల్ ఆరోపించారు. ప్రజలను నమ్మించి మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. వ‌చ్చే తెలంగాణ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించేందుకు 100 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌ని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక అస‌లు ఎన్నికే కాద‌ని.. త‌న గెలుపును ఎవ‌రూ ఆప‌లేర‌ని వ్యాఖ్యానించారు. ప‌నిలో ప‌నిగా... తాను తెలంగాణ‌కు కాబోయే సీఎం అని.. అమెరికాను చేస్తాన‌ని చెప్పారు.
Tags:    

Similar News