క‌డ‌ప జ‌డ్పీ చైర్మ‌న్.. ఆయ‌న‌కా, ఈయ‌న‌కా!

Update: 2020-03-15 00:30 GMT
ఒక‌వైపు స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ కొన‌సాగుతూ ఉండ‌గా.. మ‌రోవైపు జడ్పీ చైర్మ‌న్ ప‌ద‌వులు ఎవ‌రికి అనేది ఆస‌క్తిదాయ‌కంగా మారింది. అధికార పార్టీ లో ఇప్పుడు అనుకోని డిమాండ్ ఏర్ప‌డింది జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వుల‌కు. ఒక‌వేళ ఏపీలో శాస‌న‌మండ‌లి కొన‌సాగుతూ ఉండే.. జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వులకు మ‌రీ ఇంత డిమాండ్ ఉండేదేమీ కాదు. ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకోలేక‌పోయిన నేత‌లు, ఎన్నిక‌ల్లో పార్టీ కోసం ప‌ని చేసిన నేత‌లు ఎమ్మెల్సీ ప‌ద‌వుల మీద క‌న్నేసే వాళ్లు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక ఇక జ‌రిగే అవ‌కాశాలే క‌నిపించ‌డం లేదు. దీంతో స‌ద‌రు నేత‌లు జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వుల‌ను టార్గెట్ గా చేసుకున్నారు.

ఈ క్ర‌మంలో సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా వైఎస్ఆర్ క‌డ‌ప జ‌డ్పీ చైర్మ‌న్ గిరి విష‌యంలో ఒక మాజీ ఎమ్మెల్యే గ‌ట్టిగా ఆశ పెట్టుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆయ‌న మ‌రెవ‌రో కాదు.. రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమ‌ర్ నాథ్ రెడ్డి. గ‌త ఏడాది అసెంబ్లీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆయ‌న ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసిన సంగ‌తి తెలిసిందే.

అప్పుడు పార్టీలోకి చేరి వ‌చ్చిన మేడా మ‌ల్లికార్జున రెడ్డి కోసం అమ‌ర్ నాథ్ రెడ్డి టికెట్ ను త్యాగం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వీరిద్ద‌రూ క‌లిసే ప‌నిచేశారు. ఇద్ద‌రూ క‌లిసే ప్ర‌చారం చేసుకున్నారు. మేడా ఎమ్మెల్యేగా నెగ్గారు. అలా త్యాగం చేసిన ఆకేపాటి ఇప్పుడు జ‌డ్పీ చైర్మ‌న్ ప‌ద‌వి మీద దృష్టి పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసినందుకు త‌న‌కు ఆ ప‌ద‌విని కోరుతున్నార‌ట అమ‌ర్ నాథ్ రెడ్డి. ఈ విష‌యంలో సీఎం జ‌గ‌న్ కూడా సానుకూలంగానే ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. క‌డ‌ప జిల్లాలో ఎలాగూ ఈ ఊపులో జ‌డ్పీ చైర్మ‌న్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ద‌క్కుతుంది. కాబ‌ట్టి.. ఆకేపాటి అమ‌ర్ నాథ్ రెడ్డి ఈ మేర‌కు బోర్డు రెడీ చేసి పెట్టుకోవ‌చ్చేమో.. వైఎస్ఆర్ క‌డ‌ప జిల్లా జ‌డ్పీ చైర్మ‌న్ అని!
Tags:    

Similar News