టీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాటకు నో అన్నకడియం

Update: 2016-08-15 09:51 GMT
అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మాటను ఆ పార్టీకి చెందిన మంత్రి కాదంటారా? అలాంటి అవకాశం ఉంటుందా? మంత్రికి మంట పుట్టే మాటను ఎమ్మెల్యే చెప్పే అవకాశం ఉంటుందా? మంత్రికి మంట పుట్టే వాదనను ఒక అధికారపార్టీ ఎమ్మెల్యే తెర మీదకు తీసుకొస్తారా? అంటే కాదనే చెబుతారు. కానీ.. అందుకు భిన్నమైన దృశ్యం.. తాజాగా తెలంగాణలో చోటు చేసుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటులో ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి..ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని జిల్లాల వారీగా సేకరిస్తోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా ఇప్పటికే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి నేతలు.. కొత్త జిల్లాల ఏర్పాటుపై తమ అభ్యంతరాల్ని పార్టీలకు అతీతంగా ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాన్ని హైదరాబాద్ జిల్లాలో కలిపితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే తాజాగా మరికొన్ని జిల్లాలకు చెందిన నేతలు సైతం తమ అభ్యంతరాల్ని ఉప సంఘం దృష్టికి తెస్తున్నారు.

ఈ క్రమంలో అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తీసుకొచ్చిన ఒక వాదన పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆయన తెర మీదకు తీసుకొచ్చిన వాదన ఏమిటంటే.. కొత్త జిల్లాల్లో జనాభా మధ్య అంతరం ఎక్కువగా ఉండకూడదని ఆయన చెబుతున్నారు. ప్రతిపాదిత మహబూబ్ నగర్ జిల్లాలో 17 లక్షల జనాభా ఉండగా.. వనపర్తిలో 13 లక్షలు.. నాగర్ కర్నూలులో 9 లక్షలు ఉండటం సరి కాదని ఉదాహరణలో చెప్పుకొచ్చారు.

కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అన్నిఅంశాలు సమతూకంగా ఉంచాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కారు మీద ఉండాలి. ఒకవేళ ఆ విషయంలో తప్పటడుగు పడితే ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. శ్రీనివాస్ గౌడ్ చేసిన వాదనపై మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన ఉప సంఘం సభ్యుడి హోదాలో స్పందించిన ఆయన.. అన్ని జిల్లాల్లో జనాభా సమానంగా ఉండటం సాధ్యం కాదని తేల్చారు. జిల్లా కేంద్రాలు.. పెద్ద పట్టణాలుగా ఉన్నప్పుడు జిల్లాల జనాభా ఎక్కువగా ఉంటుందన్న ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలు శాస్త్రీయంగా ఉన్నాయన్న వాదనను వినిపించారు. ఒకవేళ.. శాస్త్రీయంగా ఉంటే.. జిల్లాల జనాభా మొదలు అన్ని అంశాలు సమతూకంగా ఉండాలే కానీ.. భారీ హెచ్చు తగ్గులు ఎందుకు ఉన్నట్లు..?
Tags:    

Similar News