జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకోవాల‌ట‌!

Update: 2017-11-08 04:33 GMT
వైసీపీ అధినేత‌ - ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్‌ పై మంత్రి క‌ళా వెంక‌ట్రావు ఓ రేంజ్‌ లో ఫైర‌య్యారు. ప్ర‌స్తుతం ప్ర‌జాసంక‌ల్ప పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌కు నేరుగా కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. జ‌గ‌న్ మాట నిల‌బెట్టుకోవాలంటూ స‌వాల్ రువ్వారు. మొత్తానికి గ‌త విష‌యాల‌ను తొవ్వి తీసిన మంత్రి క‌ళా.. త‌న‌దైన స్టైల్‌ లో విరుచుకుప‌డ్డారు. విష‌యంలోకి వెళ్తే.. జ‌గ‌న్ పాద‌యాత్ర రెండో రోజు మంగ‌ళ‌వారం కూడా బ్ర‌హ్మాండంగా సాగింది. అడుగ‌డుగునా ప్ర‌జ‌లు ఆయ‌న‌కు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. ఈ క్ర‌మంలో అధికార పార్టీ నేత‌లు - మంత్రులు జ‌గ‌న్‌ పై విమ‌ర్శ‌లు సంధిస్తున్నారు. పాద‌యాత్ర తాలూకు బెనిఫిట్ ఆయ‌న ఎక్క‌డ కొట్టేస్తారో? ఏమో? అనుకున్నారేమో.. నేత‌లు ఒక్క‌రొక్క‌రుగా విరుచుకుప‌డుతున్నారు.

ఈ క్ర‌మంలోనే రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి క‌ళా వెంక‌ట్రావు.. మంగ‌ళ‌వారం అమ‌రావ‌తిలో ప్ర‌త్యేకంగా  మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న జ‌గ‌న్ ల‌క్ష్యంగా కామెంట్లు కుమ్మేశారు. పాదయాత్ర ప్రారంభించినప్పుడు కూడా జ‌గ‌న్ ఏపీ ప్రత్యేక హోదా అంశాన్ని లేవ‌నెత్త‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పిన జ‌గ‌న్ - ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని అడిగారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం ఎంపీల‌తో రాజీనామా చేయించాల‌ని స‌వాల్ విసిరారు. జ‌గ‌న్ నీతివంత‌మైన రాజ‌కీయాలు చేయాలంటూ పెద్ద ఎత్తున ప్ర‌సంగాలు చేయ‌డం కాద‌ని, గ‌తంలో అన్న‌మాట‌ల‌ను నిల‌బెట్టుకోవాల‌ని అన్నారు.

విభ‌జ‌న త‌ర్వాత క‌ష్టాల్లో ఉన్న ఏపీలో పరిశ్రమల స్థాపన కోసం విశాఖప‌ట్నంలో సీఎం చంద్ర‌బాబు నానా క‌ష్టాలు ప‌డి పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు పెట్టార‌ని చెప్పారు. అయితే, ఈ స‌ద‌స్సును కూడా  జగన్ అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని కళా  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ‌తంలో ఆందోళ‌న చేయ‌డానికి వెళుతున్న‌ జ‌గ‌న్‌ను విశాఖ‌ప‌ట్నంలోని విమానాశ్ర‌యంలో అడ్డుకుంటే, తాను త్వరలో సీఎంని అవుతానని, ఆ త‌రువాత అంద‌రి ప‌నీ చెబుతాన‌ని పోలీసుల‌ని బెదిరించారని అన్నారు. అటువంటి జ‌గ‌న్ మాట‌ల‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌బోర‌ని చెప్పారు. జ‌గ‌న్‌ కు విశ్వ‌స‌నీయ‌త లేద‌ని అన్నారు. పాద‌యాత్ర చేసినా.. ఇంకేం చేసినా జ‌నాలు చంద్ర‌బాబు పైనే న‌మ్మ‌కం ఉంచుకున్నార‌ని, 2019లోనే కాకుండా ఎప్పుడు ఎక్క‌డ ఎన్నిక‌లు జ‌రిగినా టీడీపీకే ప్ర‌జ‌లు ఓట వేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని గొప్ప‌లు పోయారు.
Tags:    

Similar News