రోజమ్మ అలా ఫోటోలు దిగొచ్చా?

Update: 2015-03-18 07:11 GMT
ప్రభుత్వం అన్నాక కొన్ని నిబంధనలు.. సంప్రదాయాలు ఉంటాయి. ఎలా పడితే అలా వ్యవహరించటానికి వీల్లేదు. అందులోకి ప్రతి విషయంలో తప్పుల్ని వెతికి మాట్లాడే ఎమ్మెల్యే రోజా లాంటి వారికి తప్పులు ఏమాత్రం సూట్‌ కావు.

నిత్యం ఏపీ అధికారపక్షం తప్పుల్ని ఎత్తి చూపే విషయంలో మహా చురుగ్గా వ్యవహరించే ఆమె.. తనకు తాను  తప్పులు చేయకూడదు కదా. మంగళవారం అసెంబ్లీ సమావేశాల తర్వాత ఆమె చేసిన నిర్వాకం కాస్తంత ఆలస్యంగా బయటకు వచ్చింది.

ఏపీ అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బయట వ్యక్తులతో కలిసి సభలో ఫోటోలు దిగటం వివాదమైంది. నిబంధనల ప్రకారం సభలో బయట వ్యక్తులతో కలిసి ఫోటోలు దిగకూడదు. కానీ.. అదేమీ పట్టించుకోని ఆమె.. బయట వ్యక్తులతో కలిసి ఫోటోషూట్‌లాంటిది పెట్టేశారు. ఈ విషయంపై ఏపీ అధికారపక్షం అగ్రహం వ్యక్తం చేసింది.

రోజాగాపై చీఫ్‌ విప్‌ కాల్వ శ్రీనివాసులు సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ప్రతిపాదించారు. అసెంబ్లీకి కొత్తగా రావటం వల్ల తెలీక రోజా తప్పులు చేసి ఉండొచ్చు. దీనికి సభాహక్కుల ఉల్లంఘన వరకూ వెళ్లకుండా.. ఇది మంచి పద్దతి కాదని సున్నితంగా మందలిస్తే బాగుండేదేమో. రోజమ్మ తప్పు చేసిందని.. ఏపీ అధికారపక్షం సైతం విపక్ష నేతపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం సరైన పద్ధతేనా?

Tags:    

Similar News