మళ్లీ జనాల్లోకి క‌ల్వ‌కుంట్ల‌ క‌విత.. పూర్వ‌వైభ‌వం సాధ్య‌మేనా?

Update: 2021-03-14 14:30 GMT
‘బ‌తుక‌మ్మ అంటే క‌విత‌.. క‌విత అంటే బ‌తుక‌మ్మ‌’ అన్నట్టుగా ఉండేది ఒక‌ప్ప‌టి ప‌రిస్థితి. తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలిగా రాష్ట్ర‌వ్యాప్తంగా ఓ వెలుగు వెలిగిన క‌విత‌.. నిజామాబాద్ ఎంపీగా ఉన్నంత కాలం పీక్ స్టేజ్ ను చ‌విచూశారు. కానీ.. 2019లో నిజామాబాద్ పార్ల‌మెంటు ఎన్నిక‌లో ఓడిపోయిన త‌ర్వాత డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యింది. చాలా వేగంగా ఆమె గ్రాఫ్‌ ప‌డిపోయింది. దీంతో.. క్ర‌మంగా చ‌ర్చ‌ల్లో లేకుండా పోయారు.

దీంతో.. ఎలాగైనా కూతురిని మ‌ళ్లీ లైమ్ లైట్లోకి తేవాల‌నుకున్న కేసీఆర్‌.. అదే నిజామాబాద్ లో స్థానిక సంస్థ‌ల కోటాలో ఎమ్మెల్సీగా నిల‌బెట్టి గెలిపించారు. ఎమ్మెల్సీగా విజ‌యం సాధించిన త‌ర్వాత మ‌ళ్లీ మెల్ల మెల్ల‌గా ప్ర‌జాక్షేత్రంలో క‌నిపిస్తున్నారు క‌విత.

ఒక‌ద‌శ‌లో ఆమెకు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం కూడా సాగింది. కేసీఆర్ స్థానంలో ఆయన కొడుకు కేటీఆర్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్నాడ‌ని ఓ రేంజ్ లో ప్ర‌చారం సాగిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలోనే క‌విత తెలంగాణకు మంత్రి ప‌ద‌వి కూడా ఇస్తార‌ని చ‌ర్చ న‌డిచింది. కానీ.. తానే సీఎంగా కొన‌సాగుతాన‌ని కేటీఆర్ ప్ర‌క‌టించ‌డంతో అన్నిర‌కాల ప్ర‌చారాల‌కూ తెర‌ప‌డింది.

అయితే.. తాజాగా క‌విత పుట్టిన రోజు వేడుక‌లు జ‌రిగాయి. గ‌తేడాది చ‌డీచ‌ప్పుడు లేని వేడుక‌లు.. ఈ ఏడాది ఘ‌నంగా నిర్వ‌హించ‌డం విశేషం. రాష్ట్ర‌వ్యాప్తంగా ఫ్లెక్సీల ఏర్పాటు, మొక్క‌ల పంప‌కం, ర‌క్త‌దానాలు, కార్య‌క‌ర్త‌ల కేక్ క‌టింగుల‌తో ఓ రేంజ్ లో బ‌ర్త్ డే పార్టీలు నిర్వ‌హించారు. అంతేకాదు.. ఈ వేడుక‌ల్లో పార్టీ త‌ర‌పున హోంమంత్రి మ‌హ‌మూద్ అలీతోపాటు ఎమ్మెల్యేలు, ప్ర‌ధాన నాయ‌కులు చాలా మంది పాల్గొన్నారు.

ఇవ‌న్నీచూస్తుంటే.. క‌విత మ‌ళ్లీ లైమ్ లైట్లోకి వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. అయితే.. అది ఎంత వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుంది? పూర్వవైభవం తిరిగి వస్తుందా? అన్న చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో టీఆర్ఎస్ తిరుగులేదు. కేసీఆర్ కు ఎదురులేదు అన్న‌ట్టుగా ఉండేది ప‌రిస్థితి. కానీ.. ఇప్పుడు గులాబీ పార్టీ గ‌తంలో ఎన్న‌డూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. విప‌క్షాలు బ‌లం పుంజుకునే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నిక‌లు, నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో తేడా వ‌స్తే.. విప‌క్షాల‌కు మ‌రింత బ‌లం అందివ‌చ్చిన‌ట్టే.. ఇలాంటి ప‌రిస్థ‌తుల్లో పూర్వ‌వైభ‌వం కోసం ప్ర‌య‌త్నిస్తున్న క‌విత ఆశ‌లు ఎంత మేర స‌క్సెస్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News