కేకేను ట్రాప్ చేసినట్లే.. ఏపీ మహిళా ఎమ్మెల్యేకు ట్రాప్

Update: 2020-09-02 02:30 GMT
తెలంగాణ రాష్ట్ర రాజ్యసభ సభ్యుడు.. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు కేకే అలియాస్ కేశవరావును ఇటీవల సైబర్ క్రైం కేటుగాళ్లు ట్రాప్ చేసిన వైనం తెలిసిందే. చివరి క్షణంలో సందేహం వచ్చి మంత్రి కేటీఆర్ కు ఫోన్ చేయటంతో.. తనను మోసం చేయబోతున్నారన్న విషయాన్ని తెలుసుకొని.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వైనం తెలిసిందే. సంచలనంగా మారిన ఈ ఉదంతం తరహాలోనే ఏపీలోకి ఒక మహిళా ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్లు తాజాగా ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు.

సాంకేతికతను చావుతెలివితేటలకు వినియోగిస్తున్న సైబర్ నేరగాళ్లు ఇన్నాళ్లు సామాన్యులకు బురిడీ కొట్టే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి.. ప్రముఖులను టార్గెట్ చేయటం సంచలనంగా మారుతోంది. ఏపీకి చెందిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ కు తాజాగా అలాంటి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది.

ఒక అగంతుకుడు ఫోన్ చేసి తాను కేంద్ర ప్రభుత్వ అధికారిగా పరిచయం చేసుకొని పీఎంఈజీపీ కింద భారీ ఎత్తున రుణం ఇప్పిస్తానని చెప్పారు. ఈ పథకం కింద రూ.3 కోట్ల మేర రుణం తీసుకోవచ్చని.. యాభై శాతం సబ్సిడీకి అవకాశం ఉందని.. ఈ రోజే చివరి రోజంటూ ఆఫర్ల మీద ఆఫర్లు చెప్పేసి ఊరించేశారు. అంతా అయ్యాక చివర్లో.. ఇంత భారీ మొత్తంలో రుణం పొందాలంటే రూ.3లక్షల మొత్తం బ్యాంకులో డిపాజిట్ చేయాలని పేర్కొన్నారు.

తనకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి.. ఫోన్ చేసి ఇలా ఆఫర్ల మీద ఆఫర్లు చెప్పేయటం.. చివర్లో రూ.3లక్షల మొత్తాన్ని డిపాజిట్ చేయాలని చెప్పటంతో అనుమానం చెందారు. వెంటనే.. ఆమె పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. అతగాడు చెప్పిన పథకం గురించి ఆరా తీశారు. అదంతా మోసమన్న విషయాన్ని గుర్తించిన ఆమె వెంటనే కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేకే టోకరా ఇవ్వబోయిన ఆగంతుకుడ్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి.. మొత్తం వివరాల్ని సేకరిస్తున్నారు. మొన్ననే తెలంగాణ రాజ్యసభ రాజ్యసభ సభ్యుడు కేకేను ఇదే రీతిలో మోసం చేయటం తెలిసిందే.
Tags:    

Similar News