గోదాలో దిగ‌క‌ముందే..క‌మ‌ల్ పొత్తుల ఆరాటం

Update: 2018-06-22 01:30 GMT
దేశ‌వ్యాప్తంగా బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ త‌న వ్యూహాల‌కు మ‌రింత ప‌దునుపెడుతోంది. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా ఆ పార్టీ స్కెచ్చులు వేస్తోంది. ఇప్ప‌టికే విపక్షాల ఐక్య‌త‌కు కృషిచేస్తున్న కాంగ్రెస్ మ‌రోవైపు భ‌విష్య‌త్‌ లో కీల‌కంగా మారే నేత‌లను కూడా దువ్వుతోంద‌ని అంటున్నారు. న‌టుడు - మక్కల్ నీదిమయ్యం వ్యవస్థాపకుడు కమల్‌హాసన్ యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో స‌మావేశం అవ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. అంత‌కుముందు రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బుధవారం భేటీ అవ‌డం - ఆయ‌న‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఈ కొత్త చ‌ర్చ‌కు మ‌రింత ఆజ్యం పోస్తోంది.

తన పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఢిల్లీకి వచ్చిన కమల్‌ హాసన్ నేరుగా రాహుల్‌ గాంధీ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. దేశంలో - తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు చర్చించారు. అనంతరం రాహుల్ ట్వీట్ చేస్తూ `కమల్‌ హాసన్‌ తో భేటీ కావడం సంతోషంగా ఉంది. భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించాం. ఇరు పార్టీలకు చెందిన అంశాలపై మాట్లాడుకున్నాం. తమిళనాడులో రాజకీయ పరిస్థితులూ చర్చకు వచ్చాయి` అని పేర్కొన్నారు. రాహుల్‌ తో భేటీ అనంతరం కమల్‌ హాసన్.. ప్రియాంకగాంధీని కూడా కలుసుకున్నారు. ఆ మ‌రుస‌టి రోజే సోనియాగాంధీతో క‌మ‌ల్‌హాస‌న్ సమావేశమయ్యారు. సోనియాను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కమల్.. మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. అయితే కాంగ్రెస్ నేతలను కమల్ కలుస్తుడటంపై కమల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని కమల్ తెలిపారు.

కాగా, కమల్ హాసన్ త‌న పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఢిల్లీ వచ్చి బుధవారం ఈసీని కలిసి అవసరమైన పత్రాలు సమర్పించిన తరువాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీని, ఆయ‌న త‌ల్లి సోనియాగాంధీని క‌లిసి చ‌ర్చించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఢిల్లీలో కాంగ్రెస్ అధినాయకత్వంతో రెండు రోజులుగా మంతనాలు జరుపుతుండం బ‌ట్టి చూస్తే... మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ భ‌విష్య‌త్‌ లో కాంగ్రెస్‌ తో క‌లిసి సాగ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. పూర్తిగా రాజ‌కీయ‌గోదాలోకి దిగ‌క‌ముందే..క‌మ‌ల్‌ను కాంగ్రెస్ ప్యాక‌ప్ చేసేసింద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.
Tags:    

Similar News