వైకాపాలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే?

Update: 2016-11-17 07:26 GMT
అనంతపురం జిల్లా కదిరి మాజీ ఎమ్మెల్యే - ఆ నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కందికుంట వెంకటప్రసాద్‌ వైసీపీలో చేరుతారని తెలుస్తోంది.  పార్టీలో చేర్చుకునే విషయమై జిల్లా వైకాపా నేతలు పలుదఫాలుగా కందికుంట సన్నిహితుల ద్వారా చర్చలు జరిపినట్లు చెబుతున్నారు. టిడిపిలో తనకు తగినంత ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గత కొంతకాలంగా పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న కందికుంట త్వరలో వైకాపాలో చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

అనంతపురం జిల్లాలో పట్టు సాధించేందుకు వైకాపా ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలన్న చందంగా రాజకీయ ఎత్తుగడలకు శ్రీకారం చుడుతోంది. గత ఎన్నికల్లో జిల్లాలో దారుణంగా దెబ్బతిన్న పార్టీ పట్టు సాధించేందుకు పావులుకదుపుతోంది. ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌ బాషా వైకాపాను వీడి సైకిలెక్కడంతో కదిరిలో పార్టీకి పూర్వవైభవం తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే - టిడిపి నియోజకవర్గం కన్వీనర్ కందికుంట వెంకటప్రసాద్‌ ను వైకాపాలో చేర్చుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రసాద్‌ ను బరిలో నిలిపి పోయిన సీటు దక్కించుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వైకాపా తరఫున ఉరవకొండలో విశ్వేశ్వరరెడ్డి - కదిరిలో అత్తార్ చాంద్‌ బాషా గెలుపొందారు. అయితే అత్తార్ చాంద్‌ బాషా అనూహ్యంగా టిడిపిలో చేరడంతో విశ్వేశ్వరరెడ్డి ఏకైక ఎమ్మెల్యేగా మిగిలారు. అయితే అత్తార్ రాకను మాజీ ఎమ్మెల్యే కందికుంట జీర్ణించుకోలేకపోయారు. ఇద్దరు ఎడమొహం పెడమొహంగా మెలుగుతూ వచ్చారు. నియోజకవర్గం కన్వీనర్‌ గా ఉన్న కందికుంట అత్తార్‌ తో కలిసి పనిచేయకపోవడంతో అధిష్టానం పలుసార్లు మందలించింది. ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి.. లేకుంటే వెళ్లిపోండి.. అంటూ టీడీపీ అధిష్టానం హుకుం జారీచేయడంతో కందికుంట తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన వైసీపీ కండువా కప్పుకొంటారని తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News