ఇందిరాగాంధీ మూడో కొడుకు ఎవరో తెలుసా?

Update: 2016-07-04 10:36 GMT
మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఎంతమంది కొడుకులని అడిగితే.. ఇద్దరే అని ఎవరైనా చెప్తారు ఎవరైనా. రాజీవ్ గాంధీ - సంజయ్ గాంధీలే కాకుండా ఇందిరాగాంధీకి మూడో కొడుకు కూడా ఉన్నారట. ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారట. ఆయనెవరో కాదు.. టీడీపీ నేత కరణం బలరాం. ఆ విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఇందిరాగాంధీని తాను గతంలో సేవ్ చేయడంతో ఆమె తననెప్పుడూ ‘నా మూడో కొడుకు’ అనేదని చెప్పారు. రీసెంటుగా ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ సంగతులన్నీ చెప్పుకొచ్చారు.  1978లో ఎలక్షన్ టూర్ నిమిత్తం కర్ణాటక నుంచి ఒంగోలుకు ఇందిరాగాంధీ వచ్చారు.. అప్పటికి ఆమె అధికారంలో లేకపోయినా మాజీ ప్రధానిగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆమెకు సరైన భద్రత కల్పించలేదు. ఒక్క పోలీసోడు కూడా లేడట. ఆమెను ఏదో ఒక విధంగా ఇన్ సల్ట్ చేయాలని చెప్పి - ఆమెకు సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేయలేదట. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు కొందరు నేతల నుంచి ఇబ్బంది వస్తే తన జీపులో ఆమెను కూర్చెబెట్టి - స్వయంగా తానే నడుపుతూ ఒంగోలు జిల్లాను దాటించి రక్షించానని బలరాం చెప్పారు. ఆ తరువాత ఒకసారి ఆమె బహిరంగ సభలోనే బలరాం నా మూడోకొడుకు అని చెప్పారని బలరాం చెప్పుకొచ్చారు. వేల కోట్లు ఇచ్చినా రాని తృప్తి ఆ మాటతో తనకు వచ్చిందని బలరాం చెప్పుకొచ్చారు.

అదే సమయంలో తన రాజకీయ జీవితంలోని ఇతర ఘట్టాలనూ ఆయన మాట్లాడారు.  కరణం బలరామంటే కత్తులు కటార్లు తప్పా - ఎటువంటి అభివృద్ధి ఉండదన్న మాట అసత్యమని.. తాను తన ప్రజల కోసం అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. కార్యకర్తలే తన బలమని.. వారి కోసం ఏమైనా చేస్తానని బలరాం చెప్పారు. కార్యకర్తలను కాపాడుకోలేనివాడు మనిషే కాదని అభిప్రాయపడ్డారు.  మనల్ని కాపాడే కేడర్ ఉన్నప్పుడు వారికేదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వారిని కాపాడాల్పిన బాధ్యత ఆ పార్టీ నాయకుడికి ఉంటుందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో తామంతా ఉన్నప్పుడు చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించింది కూడా తానేనని కరణం బలరాం చెప్పారు. ఆయనకు మంత్రి పదవిని ఇప్పించేందుకు తానెంతో కష్టపడ్డానని, ఆ విషయాలు చంద్రబాబుకు బాగా తెలుసునని అన్నారు.  తన రాజకీయ ప్రత్యర్థి అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గురించి మాట్లాడుతూ ఆయన తన దృష్టిలో చిన్న పిల్లాడని అన్నారు. మొత్తానికి మారిన రాజకీయ పరిస్థితుల్లో టీడీపీలోనే ఉన్నప్పటికీ చంద్రబాబు ఆగ్రహాన్ని చవిచూస్తున్న బలరాం చాలాకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. గతంలో ఘనుడే అయినప్పటికీ ప్రస్తుతం రాజకీయంగా దెబ్బతిన్న బలరాం ఎలాంటి అడుగులు వేస్తారో చూడాలి.
Tags:    

Similar News