14మంది రెబల్స్ పై వేటు.. కన్నడ స్పీకర్ సంచలనం

Update: 2019-07-28 07:25 GMT
కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ సర్కారును కూల్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామన్న సంతోషాన్ని ఒక్కరోజు కూడా మిగలనివ్వకుండా బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్. తాజాగా ఆయన కర్ణాటకలో కుమారస్వామి సర్కారు పడిపోవడానికి కారణమైన 14మంది రెబల్స్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. రెండు రోజుల క్రితం ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేసిన స్పీకర్.. తాజాగా 14మందిని సస్సెండ్ చేయడం సంచలనంగా మారింది.

తాజాగా కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ కాంగ్రెస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు చెందిన ముగ్గురు, ఒక స్వతంత్ర ఎమ్మెల్యేపై వేటు వేశారు. అసెంబ్లీలో సోమవారం జరిగే విశ్వాస పరీక్షకు వీరిని అనుమతించబోమని స్పీకర్ ప్రకటించారు.  

కాగా కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీకి ఈ పరిణామం షాకింగ్ లా మారింది. ఆ 14 మంది అసంతృప్త కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీయే మభ్యపెట్టి అసమ్మతి రాజేసి వేరే రాష్ట్రాలకు తరలించిందన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు వారు బీజేపీ కొలువు దీరడంతో వచ్చి మద్దతు పలుకుతామని ఆశించారు. కానీ స్పీకర్ అనర్హతతో వారు విశ్వాస పరీక్షకు హాజరుకారు. మొత్తం సభ్యుల్లో మెజార్టీ కనుక తగ్గితే యడ్యూరప్ప సర్కారు కూడా పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. స్పీకర్ ద్వారా కాంగ్రెస్ విసిరిన ఈ పాచిక ఇప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పడేసింది.

రెబల్స్ పై వేటుతో కన్నడ అసెంబ్లీలో బలనిరూపణ కష్టంగా మారింది. బీజేపీకి మ్యాజిక్ మార్క్ దాటుతుందా లేదా.. కాంగ్రెస్ పాచిక వేసి  బీజేపీ ప్రభుత్వం నిలబడకుండా చేస్తుందా అన్న అనుమానాలు పెరిగిపోయాయి. స్పీకర్ దెబ్బకు ఇప్పుడు కన్నడనాట బీజేపీకి చుక్కలు కనిపిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.


Tags:    

Similar News