నాది 'క‌త్తి' రామాయ‌ణం అనుకోండి:క‌త్తి మ‌హేష్

Update: 2018-07-04 16:48 GMT
రాముడిపై కత్తి మహేష్ చేసిన వ్యాఖ్య‌ల వ్య‌వ‌హారం ఇపుడు హాట్ టాపిక్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ వ్యాఖ్య‌లపై నాగ‌బాబు - ప‌రిపూర్ణానంద స్వామి వంటి వారితో పాటు ప‌లువురు మండిప‌డుతోన్న విష‌యం విదిత‌మే. ఈ నేప‌థ్యంలో ఒక వెబ్  చానెల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మ‌హేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను హిందూధ‌ర్మానికి వ్య‌తిరేకంగా మాట్లాడ‌లేద‌ని - రాముడిని అస‌లు తిట్ట‌లేద‌ని అన్నారు. ఓ టెలివిజ‌న్ షోలో బాబు గోగినేని గారు అన్న మాట‌ల‌పై తాను ప్ర‌తిస్పందించాన‌ని చెప్పారు. రావ‌ణుడితోనే సీత ఉంటే బాగుండేది అన్న బాబు గోగినేని గారి అభిప్రాయంతో తాను కూడా ఏకీభ‌విస్తున్నాన‌ని  ఆ ప్ర‌శ్న‌కు జ‌వాబిచ్చాన‌ని అన్నారు. రామాయ‌ణం త‌న‌కో కావ్య‌మ‌ని - త‌న‌ను న‌మ్ముకున్న నిండు గ‌ర్భ‌వ‌తి అయిన సీత‌ను అడ‌వుల‌లో వ‌దిలేసిన రాముడు ద‌గుల్బాజీ అని అన్నాన‌ని వ్యాఖ్యానించారు. ద‌గుల్బాజీ అన్న ప‌దానికి అర్థం తెలియ‌క దానిని ఓ బూతు అనుకున్నార‌ని - ఆ ప‌దానికి మోస‌గాడ‌ని అర్థం అని చెప్పారు.

వాలిపై చెట్టు చాటు నుంచి బాణం వేయ‌డం - రావణాసురుడి ఛాతీపై బాణం వేయ‌కుండా....క‌డుపు పై బాణం వేయ‌డం....త‌న‌ను న‌మ్ముకున్న సీత‌కు  అగ్నిప‌రీక్ష పెట్ట‌డం...ఆ త‌ర్వాత నిండు గ‌ర్భిణి అయిన సీత‌ను అడ‌వుల‌లో వ‌దిలేయ‌డం...వంటిని దృష్టిలో ఉంచుకొని తాను రాముడిని మోస‌గాడ‌ని అన్నాన‌ని చెప్పారు. దానిని స‌రిగా అర్థం చేసుకోలేక తాను మ‌త విద్వేషాలు రెచ్చ‌గొడుతున్నాన‌ని అపోహ‌లు సృష్టిస్తున్నార‌ని అన్నారు. రాముడు అన‌గానే కొంద‌రు బీజేపీ - ఆర్ ఎస్ ఎస్ కార్య‌క‌ర్త‌లు దానిని త‌మ రాజ‌కీయ అస్థిత్వం కోసం ఎమోష‌న‌ల్ ఇష్యూగా తీసుకుంటార‌ని అన్నారు. రంగ‌నాయ‌క‌మ్మ గారు రామాయ‌ణ విషవృక్ష‌మ‌ని గ్రంథ‌మే రాశార‌ని, ద‌క్షిణాది వ‌ర‌కు....కంబ రామాయ‌ణం ప్ర‌కారం రావ‌ణుడిపై రాముడు దాడి చేసిన‌ట్లు కొంద‌రు భావిస్తార‌ని అన్నారు. ఇన్ని రామాయ‌ణాల్లో త‌న‌కు అర్థ‌మైన రామాయ‌ణాన్ని తాను చెబుతున్నాన‌ని, దీనిని `క‌త్తి రామాయ‌ణం` అనుకోవ‌చ్చ‌ని చెప్పారు. తాను సీత‌ను ఏలుకోన‌ని అగ్ని ప‌రీక్ష‌కు ముందు సీత‌తో స్వ‌యంగా రాముడే చెప్పాడ‌ని, రామాయ‌ణాన్ని స‌రిగ్గా చ‌దివి అర్థం చేసుకోలేని వారు త‌న‌ను విమ‌ర్శిస్తున్నార‌ని మ‌హేష్ అన్నారు. తాను కూడా రాముడి గుడికి వెళ్లి దండం పెట్టి ప్ర‌సాదం తిని వ‌స్తాన‌ని...అదే స‌మ‌యంలో రామాయ‌ణం చ‌దివి అందులోని విష‌యాల‌పై స‌హేతుక‌మైన ప్ర‌శ్న‌లు, విమ‌ర్శ‌లు చేస్తాన‌ని అన్నారు. అవి అర్థం చేసుకోలేని వారు అన‌వ‌స‌రంగా ర‌చ్చ చేస్తున్నార‌ని అన్నారు.




Tags:    

Similar News