ఈ సంస్కారం మాటలేంది కవితక్క?

Update: 2016-09-04 06:01 GMT
పవర్ లో ఉండే చిక్కులు ఎక్కువ. అధికారంలో ఉన్నప్పుడు అందరూ అడిగేవాళ్లే. అడుగుతున్న వారిని తప్పు పట్టటం సరికాదు. తొలుత వారి సందేహాల్ని తీర్చాల్సిన బాధ్యత అధికారపక్షం మీద ఉంటుంది.కానీ.. ఆ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ ఎంపీ కవితక్క బ్యాలెన్స్ మిస్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తమపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పని కవిత.. వారిపై మాటలతో ఎదురుదాడికి దిగటం కనిపిస్తోంది.

రాజకీయాల్లో విమర్శ.. ప్రతివిమర్శ మామూలే. కానీ.. అదేదీ శ్రుతిమించకూడదు. తాజాగా గద్వాల్.. జనగామను కొత్త జిల్లాలుగా ప్రకటించాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత డీకే అరుణ రెండు రోజుల దీక్షనుచేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఏ ప్రాతిపదికన చేశారన్న విషయాన్ని సూటిగా అడగటంతో పాటు.. తాను మరో రోజు ఇక్కడే ఉంటానని.. దమ్ముంటే.. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు సీఎం కానీ.. ఆయన పంపిన వారు కానీ రావాలన్నారు. ఈ వ్యాఖ్యలపై కవితక్క రియాక్ట్ అయ్యారు.

ఇక్కడ ఇబ్బందేమంటే.. తమను ఎవరూ తప్పు పట్టకూడదు. తమ నిర్ణయాల్ని ఎవరూ ప్రశ్నించకూడదన్న టోన్ వచ్చేలా అధికారపక్ష నేతలు మాట్లాడకూడదు. కానీ.. కవితక్క మాటలు అదే తీరులో ఉండటం గమనార్హం. ఆమె మాటల్ని యథాతధంగా చూస్తే.. ‘‘డీకే అరుణ అని మనకూ ఓ బొమ్మాళి ఉంది. జిల్లా కావాలంటూ హైదరాబాద్ లో దీక్ష చేస్తూముఖ్యమంత్రిపై నోరు పారేసుకుంటోంది. తెలంగాణ అడబిడ్డలందరూ సంస్కారంతో మాట్లాడతారు. ఆమెకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. నోరు పారేసుకోకుండా దీక్ష మానేసి గద్వాల్ లోని మీ కోటలో విశ్రాంతి తీసుకుంటే మంచిది’’ అని వ్యాఖ్యానించారు.

ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన రాజకీయ నేతగా కవిత ప్రశ్నించటాన్ని తప్పు పట్టటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఆడబిడ్డలందరూ సంస్కారంతో మాట్లాడతారన్న వ్యాఖ్యలు చేసిన కవితపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శ చేయటం సంస్కారం కాదనుకుంటే.. కవితక్క చేస్తున్న విమర్శల్ని ఏమనాలి? అని ప్రశ్నిస్తున్నారు. ఒకరిని అవమానపరిచేలా మాట్లాడటం మంచిది కాదని.. అధికారంలో ఉన్న వారి నోటి నుంచి ఇలాంటి మాటలు అహంకారంగా ప్రజల మనసుల్లో ముద్రపడే ప్రమాదం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి మాటల్ని కవిత సానుకూలంగా తీసుకుంటారా..?
Tags:    

Similar News