టీడీపీని కెలికి చూద్దాం అంటున్న బీజేపీ

Update: 2017-05-26 08:42 GMT
-రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్‌ పడిపోతోంది. ప్రభుత్వం మొత్తం అవినీతిమయమైపోయింది. ఏపీలో జన్మభూమి కమిటీల తీరు అధ్వానంగా ఉంది. టీడీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇది మిత్రపక్షమైన బీజేపీపై పడుతోంది. దీన్నుండి పార్టీని కాపాడుకోవాల్సిన అవసరముంది. బీజేపీతో పొత్తు వ‌ల్ల న‌ష్ట‌పోయాం అని టీడీపీ ఎంపి కేశినేని నాని చేసిన‌ వ్యాఖ్యల గురించి స్పందించ‌డం అవ‌స‌ర‌మా? `నిబద్ధత` కలిగిన నాయకులు వ్యాఖ్యానిస్తే నేను స్పందిస్తాను. ఎవరు పడితే వారు మాట్లాడితే కాదు. రాజీవ్ మరణం తర్వాత చాలా ఫలితాలు తారుమారైనట్లే ఇక్కడా ఏదైనా జరగవచ్చు. -  బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షాను క‌లిసిన అనంత‌రం బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర కావూరి సాంబ‌శివ‌రావు చేసిన వ్యాఖ్య‌లు.

- రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ మ‌న పార్టీ నాయకులకు టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం విలువ ఇవ్వడం లేదు. అడుగడుగునా అవమానిస్తున్నారు. బీజేపీ నేతలు చెప్పిన ఏ పని చేయవద్దని అధికారులను ఆదేశిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులన్నీ టీడీపీ నాయకులకే ఇస్తున్నారు. కేంద్ర నిధులతో అమలయ్యే పథకాలకు కనీస ప్రచారం కూడా లేదు. వాటిపై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఫొటోలు ఉండటం లేదు. - అమిత్ షాకు బీజేపీ రాష్ట్ర నేత‌లు, ఎమ్మెల్సీలు, మాజీ కేంద్ర మంత్రులు ఫిర్యాదు చేసినట్లు వార్త‌లు.

ఏపీలోని మిత్ర‌ప‌క్షంగా టీడీపీ-బీజేపీ మ‌ధ్య పొత్తు ఉన్న‌ప్ప‌టికీ ఇరు పార్టీ నేత‌ల మ‌ధ్య అడ‌పాద‌డ‌పా మాట‌ల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి క‌లిసిన అనంత‌రం ఇది తారాస్థాయికి చేరింది. బీజేపీతో పొత్తు వ‌ల్ల న‌ష్ట‌పోయామ‌ని ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్య‌లు దీనికి ఆజ్యం పోసిన‌ట్లు అయ్యాయి. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌త్యేకంగా పార్టీ నేత‌ల‌తో మాట్లాడుతూ బీజేపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేయ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. సంయమ‌నం పాటించాల‌ని సూచించారు. అయితే అప్ప‌టికే బీజేపీ నేత‌లు క‌ల‌త చెందిన‌ట్లు స‌మాచారం.

దీంతో అమిత్ షా ఏపీకి వ‌చ్చిన సంద‌ర్భంగా ఏపీలో మిత్ర‌ప‌క్షంగా ఉండి అధికారంలో భాగం పంచుకుంటున్న‌ప్ప‌టికీ త‌మ‌కు ద‌క్కుతున్న ప్రాధాన్యం గురించి  అమిత్ షాకు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. అంతేకాకుండా టీడీపీ స‌ర్కారుపై ప్ర‌జ‌ల్లో సానుకూల అభిప్రాయం లేక‌పోవ‌డాన్ని కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని కూడ చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మొత్తంగా టీడీపీ నేత‌లు త‌మ దూకుడును ఆపేస్తే... ఏపీ బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డం వెనుక మ‌ర్మం ఏమిట‌ని ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. తెలుగుత‌మ్ముళ్లను కెలికి చూద్దామ‌నే ఆలోచన ఏమైనా ఉందా అంటూ కొంద‌రు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News