కేసీఆర్...మ‌ళ్లీ న‌వ్యాంధ్ర రాజ‌ధానికి!

Update: 2015-12-08 13:38 GMT
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని శంకుస్థాప‌న సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 22న అమ‌రావ‌తిలో అడుగుపెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధ్య‌క్షుడు కే చంద్రశేఖర్‌ రావు మ‌ళ్లీ విజ‌య‌వాడ‌కు వ‌స్తున్నారు. దాదాపు రెండునెల‌ల త‌ర్వాత కేసీఆర్‌ న‌వ్యాంధ్ర‌కు రానున్న‌ది తెలంగాణ-ఆంద్రప్రదేశ్‌ ల మ‌ధ్య సానుకూల వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌డానికో లేక‌పోతే ఆంధ్ర‌ప్ర‌దేశ్ వేదిక‌గా కొత్త రాజ‌కీయాలేవో చేసేందుకు కాదు. చాణ‌క్యుడిని మించిన రాజ‌కీయం చేసే క‌ల్వ‌కుంట్ల వారు బెడ‌వాడ గ‌డ్డ‌మీదకు వ‌చ్చే కార్యం ఏంటంటే....వ‌ద్ద‌నుకున్నా త‌ప్ప‌ని కార్య‌క్ర‌మం ఉండ‌టం వ‌ల్ల ఆయ‌న ఆంధ్ర‌కు రానున్నారు.

కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న అయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా ఆహ్వానించేందుకు రావ‌డ‌మే ఆ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం అయి ఉండ‌వ‌చ్చు అనేది మీ అంచ‌నా అయితే కేసీఆర్ దాన్ని వ‌మ్ముచేసినట్లే! ఇంత‌కీ విష‌యం ఏంటంటే... దక్షిణాది రాష్ర్టాల ముఖ్యమంత్రుల స‌మావేశానికి వేదిక నిర్ణ‌యించేందుకు కొద్దికాలం క్రితం క‌స‌ర‌త్తు జ‌రిగింది. ఈ క్ర‌మంలో స‌ద‌రు స‌మావేశాన్ని విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించేలా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు చ‌క్రం తిప్పారు. దీంతో తేదీ, షెడ్యుల్ ఖరారైంది. వేదిక‌గా విజ‌య‌వాడ క‌న్ఫ‌ర్మైంది! తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ఈ కార్య‌క్ర‌మానికి రాకుంటే త‌న‌కే ఇబ్బంది అని కేసీఆర్ భావించ‌డం వ‌ల్లే ఈ స‌మావేశానికి రావాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు సమాచారం.

ఈనెల 12న విజయవాడలో జ‌ర‌గ‌నున్న ఈ స‌మావేశానికి హాజరుకావ‌డానికి కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్లు సమాచారం. అయితే కేసీఆర్ విజయవాడ పర్యటనకు సంబంధించి ఎలాంటి షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. చండీయాగం ఆహ్వానాన్ని ఏపీ సీఎం చంద్ర‌బాబుకు విజ‌య‌వాడ‌లోనే చంద్ర‌బాబుకు అంద‌జేస్తారా లేక హైద‌రాబాద్‌లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో ఇస్తారా అనేది కూడా ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే క్లారిటీ ఇచ్చి ప‌నులు చేయ‌డం కంటే.... క‌న్ఫ్యూజ్‌లో ఉంచి క్లారిటీ ఇవ్వ‌డం కేసీఆర్ మార్క్ రాజ‌కీయం క‌దా.
Tags:    

Similar News