ఇద్ద‌రు చంద్రుళ్లు ముచ్చ‌ట బ‌య‌ట‌కొచ్చేసింది

Update: 2017-12-25 04:44 GMT
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఒకే కార్య‌క్ర‌మానికి హాజ‌రైతే అంద‌రి దృష్టి వారి మీద‌నే ఉంటుంది. ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌కు వీరిద్ద‌రు హాజ‌ర‌య్యే విష‌స‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌టం క‌నిపిస్తుంది. ఒక చంద్రుళ్లు ఒక కార్య‌క్ర‌మానికి ముందుగా వెళితే.. మ‌రోసారి ఆల‌స్యంగా వెళ్ల‌టం క‌నిపిస్తుంది. పార్టీ నేత‌లు కానీ.. ప్ర‌ముఖుల ఇళ్ల‌ల్లో జ‌రిగే ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌య్యే ఇద్ద‌రు చంద్రుళ్లు.. ఒక‌రు ఎగ్జిట్ అయ్యే స‌మ‌యానికి మ‌రొక‌రు రావ‌టం క‌నిపిస్తుంది. దాదాపుగా ఎదురుప‌డే సంద‌ర్భాలు లేకుండా చూసుకుంటుంటారు.

కొన్నిసార్లు మాత్రం ఇరువురు అలా ప‌లుక‌రించుకొని వెళ్లిపోవ‌టం క‌నిపిస్తుంది. ఈ మ‌ధ్య‌నే జ‌రిగిన ప‌రిటాల వారింట జ‌రిగిన పెళ్లి ముచ్చ‌ట‌నే గుర్తు తెచ్చుకోండి. తొలుత చంద్ర‌బాబు వ‌చ్చి వెళిపోతున్న వేళ‌.. కేసీఆర్ వెళ్ల‌టం.. వారిరువురు కొద్ది క్ష‌ణాలు మాట్లాడుకొని బై.. బై చెప్పేసుకుంటే.. కేసీఆర్ కాసేపు ఉండి వెళ్లిపోయారు.

ఇలాంటి వాటికి మిన‌హాయింపుగా క‌నిపిస్తుంటుంది గ‌వ‌ర్న‌ర్ ఇచ్చే విందు కార్య‌క్ర‌మం. ప్ర‌ముఖులు హైదరాబాద్ న‌గ‌రానికి వ‌చ్చిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని విందును ఏర్పాటు చేస్తే..ఇద్ద‌రు చంద్రుళ్లు హాజ‌రు కావ‌టం.. వీరిద్ద‌రి మ‌ధ్య ప్రైవేటు చ‌ర్చ‌లు జ‌ర‌గ‌టం మామూలే.

తాజాగా రాష్ట్రప‌తి కోవింద్ హైద‌రాబాద్ లో శీతాకాల విడిది కోసం వ‌చ్చిన నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యేక విందును ఏర్పాటు చేశారు. దీనికి ఇద్ద‌రు చంద్రుళ్లు హాజ‌ర‌య్యారు. ఈ ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల మ‌ధ్య దాదాపు 20 నిమిషాల పాటు మాట‌లు న‌డిచాయి. వీరిద్ద‌రూ ఏం మాట్లాడుకున్నార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.ఇద్ద‌రు చంద్రుళ్లు ఒకేచోట నిలుచొని మాట్లాడుకున్న విష‌యాల‌కొస్తే..

ఇటీవ‌ల ఘ‌నంగా నిర్వ‌హించిన ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల గురించి.. ప్ర‌పంచ పారిశ్రామివేత్త‌ల స‌ద‌స్సు గురించి మాట్లాడుకున్నార‌ని తెలిసింది. మ‌హాస‌భ‌ల్ని బాగా నిర్వ‌హించార‌ని చంద్ర‌బాబు కేసీఆర్‌ ను అభినందించినట్లుగా చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హాస‌భ‌ల ప్ర‌ణాళిక‌ల గురించి కేసీఆర్ ఆయ‌న‌కు వివ‌రించిన‌ట్లుగా స‌మాచారం.

ఇదే స‌మ‌యంలో ఎప్ప‌టి మాదిరి ఇద్ద‌రి మ‌ధ్య విభ‌జ‌న‌కు సంబంధించి పెండింగ్ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఏపీకి కేటాయించిన స‌చివాల‌యం.. శాఖాధిప‌తుల కార్యాల‌యాలు చాలావ‌ర‌కూ ఖాళీ చేసి అమ‌రావ‌తికి వెళ్లిపోయిన నేప‌థ్యంలో.. అవ‌న్నీ వృథాగా ప‌డి ఉన్నాయ‌ని.. వాటిని తెలంగాణ ప్ర‌భుత్వానికి అంద‌జేయాల్సిందిగా కోర‌గా.. త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది.

అదే స‌మ‌యంలో ఏపీలో ప‌ని చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల్ని తిరిగి త‌మ రాష్ట్రానికి పంపాల్సిందిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కోర‌గా.. అందుకు బాబు సానుక‌కూలంగా స్పందించిన‌ట్లుగా తెలుస్తోంది. ఇటీవ‌ల వెలువ‌డిన గుజ‌రాత్‌.. హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాల గురించి వారిద్ద‌రూ మాట్లాడుకున్న‌ట్లుగా చెబుతున్నారు. కాళేశ్వ‌రం.. పోల‌వ‌రం ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలుకూడా ఇద్ద‌రు చంద్రుళ్ల మ‌ధ్య వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇలా ఇద్ద‌రు చంద్రుళ్లు ఒక‌చోట మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో.. చివ‌ర్లో మెగాస్టార్ చిరంజీవి వారి వ‌ద్ద‌కు రావ‌టంతో ఇరువురి ముచ్చ‌ట్ల‌కు బ్రేక్ ప‌డింది. ఇక‌.. ఇద్ద‌రు సీఎంలు చిరంజీవితో కాసేపు మాట్లాడుకోవ‌టం క‌నిపించింది.
Tags:    

Similar News