అల్లం పంట కోసం ఫాంహౌస్‌కి సీఎం

Update: 2015-06-24 04:15 GMT
సెక్షన్‌ 8కి సంబంధించి వేడి ఇంకా పూర్తిగా చల్లారలేదు. అయినా.. ఆ విషయాల్ని వదిలి పెట్టి మరీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మంగళవారం రాత్రి తన ఫాంహౌస్‌కి చేరుకున్నారు. ఓ పక్క పరిణామాలు హాట్‌..హాట్‌గా ఉన్న సమయంలో ఆయన ఫాంహౌస్‌కి చేరుకున్న కారణం వింటే ఎవరికైనా కాస్తంత ఆశ్చర్యం కలగటం ఖాయం.

గత కొద్దిరోజులుగా ముసురుపట్టి వర్షాలు పడిన నేపథ్యంలో అల్లం పంట వేయటానికి అనుకూలంగా లేకుండా పోయింది. బుధవారం ఈ పంటను వేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆయన ఫాంహౌస్‌కి చేరుకున్నట్లు చెబుతున్నారు. గతంలో కాఫ్సికం సాగు విషయంలో రికార్డు సృష్టించిన కేసీఆర్‌.. ఈసారి అల్లం పంటపై దృష్టి సారించటం తెలిసిందే.

తెలంగాణ వాతావరణానికి అనుగుణంగా అల్లం సాగు చేసి.. తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఆదర్శంగా నిలవాలని.. ఈ వాణిజ్య పంటను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయాలన్న పట్టుదలతో కేసీఆర్‌ ఉన్నారు. అందుకే ఆయన ఈ పంట విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. అందుకే.. తాను సొంతంగా ఉండి మరీ అల్లం సాగును పర్యవేక్షించాలన్న ఉద్దేశ్యంతో మెదక్‌జిల్లా జగదేవపూర్‌ ఫాంహౌస్‌కి చేరుకున్నట్లు చెబుతున్నారు.

ముఖ్యమంత్రిగా ఊపిరి సలపని పనుల్లో బిజీగా ఉండి కూడా.. వ్యవసాయం మీద మక్కువతో ఇలా వ్యవహరించటం చాలా అరుదు. కానీ.. కేసీఆర్‌ రూటు సపరేటు కావటంతో.. దేని కథ దానిదే అన్న చందంగా పంట వేయాల్సిన సమయం మించి పోకూడదన్న భావనతో పాటు.. పంటను దిగ్విజయం చేయాలన్న పట్టుదలతో ఉన్న సీఎం.. ఫాంహౌస్‌కి వచ్చినట్లు చెబుతున్నారు. కేసీఆర్‌లోని రైతుకు నూటికి నూరు మార్కులు వేయాల్సిందే.

Tags:    

Similar News